గేమ్ ఆఫ్ థ్రోన్స్’ జీతాలపై అసలు నిజం బయటపెట్టిన ఖలీసి!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game of Thrones) నటీనటుల పారితోషికాలపై గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Srinivas Rao
Published on: 30 May 2026 6:28 PM IST
గేమ్ ఆఫ్ థ్రోన్స్’ జీతాలపై అసలు నిజం బయటపెట్టిన ఖలీసి!
X

గేమ్ ఆఫ్ థ్రోన్స్’ జీతాలపై అసలు నిజం బయటపెట్టిన ఖలీసి!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game of Thrones) నటీనటుల పారితోషికాలపై గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఈ సిరీస్‌లో ‘డైనరిస్ టార్గారియన్’ (ఖలీసి) పాత్రతో గ్లోబల్ స్టార్‌డమ్ తెచ్చుకున్న నటి ఎమిలియా క్లార్క్ ఆ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. తమ జీతాల గురించి వస్తున్న లెక్కలన్నీ కేవలం పుకార్లేనని ఆమె స్పష్టం చేశారు.

ఆ వార్తలు నమ్మకండి.. అంత సీన్ లేదు!

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ 'వెరైటీ'కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఎమిలియా క్లార్క్ మాట్లాడుతూ.. ఈ సిరీస్ షూటింగ్ సమయంలో తనకు, తన తోటి నటీనటులకు ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 3 లక్షల డాలర్లు (సుమారు ₹2.5 కోట్లకు పైగా) చెల్లించారనే వార్తల్లో అస్సలు నిజం లేదని తేల్చి చెప్పారు. "మాకు అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఎప్పుడూ రాలేదు. ఒకవేళ నిజంగానే అంత డబ్బు ఇచ్చుంటే.. నేను ఇప్పుడు ఒకటికి రెండు లగ్జరీ పోర్షే కార్లలో తిరిగేదాన్ని" అంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. అయితే తమకు అసలు ఎంత ఇచ్చారనే ఖచ్చితమైన నెంబర్లను మాత్రం ఆమె బయటపెట్టడానికి నిరాకరించారు.

రెమ్యునరేషన్ వ్యత్యాసాలపై గతంలోనే క్లారిటీ

2011 నుండి 2019 వరకు మొత్తం ఎనిమిది సీజన్ల పాటు సాగిన ఈ సిరీస్‌లో కిట్ హారింగ్టన్, లీనా హెడే, సోఫీ టర్నర్ వంటి ఎంతోమంది స్టార్స్ నటించారు. అయితే గతంలో 2018 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎమిలియా మాట్లాడుతూ.. పారితోషికం విషయంలో తన పట్ల ఎలాంటి వివక్ష జరగలేదని, తోటి పురుష నటులతో సమానంగానే తనకు గౌరవం దక్కిందని చెప్పారు. మరోవైపు, సాన్సా స్టార్క్ పాత్ర పోషించిన సోఫీ టర్నర్ కూడా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. జాన్ స్నో (కిట్ హారింగ్టన్)కు తనకంటే ఎక్కువ పారితోషికం లభించిందని, ఎందుకంటే చివరి సీజన్ కోసం అతను ఏకధాటిగా 70 రాత్రి వేళల్లో కష్టపడాల్సి వచ్చిందని, దానికి అతను అర్హుడేనని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు.

ప్రాణాంతక బ్రెయిన్ స్ట్రోక్స్.. షూటింగ్‌లో నరకం చూశాను!

సినిమా జీతాల గురించే కాకుండా ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో తాను ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన ఆరోగ్య సమస్యల గురించి కూడా ఎమిలియా ఎమోషనల్ అయ్యారు. 2011 , 2013 లో (సిరీస్ ప్రారంభ దశలో) ఆమెకు రెండుసార్లు తీవ్రమైన బ్రెయిన్ అనీరిజమ్స్ (మెదడులోని రక్తనాళాలు ఉబ్బిపోవడం) వచ్చాయి. ఆ సమయంలో ప్రాణాంతక పరిస్థితి నుండి ప్రాణాలతో బయటపడినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ హెల్త్ స్కార్స్ తనను మానసికంగా ఎంతో కుంగదీశాయని, కనీసం ఎవరి కళ్లలోకి చూసి మాట్లాడలేకపోయేదాన్ని అని, తన శరీరం తనను మోసం చేసిందనే బాధతో బాహ్య ప్రపంచానికి చాలా కాలం దూరంగా ఉన్నానని చెబుతూ ఎమిలియా క్లార్క్ భావోద్వేగానికి లోనయ్యారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story