Chiranjeevi: కృష్ణ వదిలేసుకున్న సినిమాతో చిరంజీవి కెరీర్ మలుపు తిరిగిందా?
Chiranjeevi: ఈరోజు చిరంజీవి గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంతగా చెప్పుకుంటోంది అంటే దానికి కారణం ఖైదీ సినిమా. అప్పట్లో సినిమా ఇండస్ట్రీని ఖైదీ సినిమాతో పోల్చేవారు.
Chiranjeevi: కృష్ణ వదిలేసుకున్న సినిమాతో చిరంజీవి కెరీర్ మలుపు తిరిగిందా?
Khaidi Movie Chiranjeevi: ఈరోజు చిరంజీవి గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంతగా చెప్పుకుంటోంది అంటే దానికి కారణం ఖైదీ సినిమా. అప్పట్లో సినిమా ఇండస్ట్రీని ఖైదీ సినిమాతో పోల్చేవారు. ఈ సినిమా విడుదల తరువాత అప్పటి వరకు ఉన్న అంచనాలన్నీ మారిపోయాయి. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన స్లాబ్ సిస్టమ్‌ను తట్టుకొని నిలబడి సూపర్ హిట్టయింది. మెగాస్టార్‌గా ఆవిర్భవించడానికి పునాదులు వేసింది. ఇంత బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ సినిమా మొదటి చాయిస్ చిరంజీవి కాదు. సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ కోసం కథను రెడీ చేశారు. కానీ, ఆయన డేట్లు ఖాళీ లేకపోవడంతో ఈ కథ చిరంజీవి వద్దకు వచ్చింది. అప్పటి వరకు సామాన్య హీరోగా ఉన్న చిరంజీవి ఈ సినిమా తరువాత మెగాస్టార్‌గా ఎదిగారు.
ఖైదీ సృష్టించిన ప్రభంజనం
సినిమా అంటే వినోదాన్ని పంచడమే కాదు..చరిత్రను సృష్టించేవిగా ఉంటాయి...మరికొన్ని చరిత్రను తిరగరాసేవిగా కూడా ఉంటాయి. ఈ కోవకు చెందిందే ఖైదీ సినిమా. 1983 అక్టోబర్ 28న ఖైదీ రిలీజ్ అయింది. అప్పటి వరకు ఉన్న కమర్షియల్ ఫార్ములాను ఈ సినిమా బద్దలు కొట్టింది. ఊహించని విజయం సాధించింది. ఈ సినిమాతో చిరంజీవి అనే మాస్ హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఖైదీ తరువాతే చిరంజీవి మాస్ కమర్షియల్ హీరోగా అవతరించారు.
కృష్ణ కాదన్నారు.. చిరంజీవి కైవసం చేసుకున్నారు!
ఈ చిత్రానికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రచయితలు పరుచూరి బ్రదర్స్ ఈ కథను మొదట సూపర్‌స్టార్ కృష్ణ కోసం సిద్ధం చేశారు. అయితే అప్పట్లో కృష్ణ గారు వరుస సినిమాలతో విపరీతమైన బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ చిరంజీవి వద్దకు చేరింది. హాలీవుడ్ చిత్రం ‘ఫస్ట్ బ్లడ్’ ప్రేరణతో రూపొందిన ఈ కథలో, అడవి నేపథ్యంలో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లు చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు అతికినట్లు సరిపోయాయి. ఆ ‘బ్లాక్ అండ్ బ్లాక్’ గెటప్ ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. చిరంజీవి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో ఆయన కెరీర్ పీక్ స్టేజ్‌కి వెళ్లింది. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో ఇలాంటి సినిమాలు వరసగా వచ్చాయి. అందులో చాలా వరకు హిట్ అందుకోవడం విశేషం. మూస ఫార్ములాకు చెక్ పెడుతూ కమర్షియల్‌గా సినిమా ఎలా హిట్ చేయవచ్చో ఖైదీ నిరూపించింది.
నటనలో కొత్త ఒరవడి
ఈ సినిమాలో సూర్యం పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు. సినిమాలో చాలా వరకు చిరంజీవికి డైలాగులు ఉండవు. ఆయన కళ్లు హావభావాలతోనే నటనను ప్రదర్శించాడు. కళ్లతోనే పగను, ఆవేశాన్ని పండించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక అప్పటికే ఇండస్ట్రీలో విలన్‌లుగా పేరుగాంచిన రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్ వంటి విలక్షణ నటులు కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యారు. అంతేకాదు, సినిమాకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోదండరామిరెడ్డి మేకింగ్ శైలి తెలుగు సినిమాకు సరికొత్త దిక్సూచీగా మారింది.




