Kanchi Narasimha Rao: అదృష్టమంటే నరసింహారావుదే... ఆ ఒక్క డైలాగే ఇండస్ట్రీ గుర్తుంచుకునేలా చేసింది
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఎవరికి పేరు వస్తుందో చెప్పడం చాలా కష్టం. కంచి నరసింహారావు విషయంలోనూ అదే జరిగింది. మాయాబజార్ సినిమాకు ముందు ఎన్నో పాత్రలు చేసినా... గుర్తింపు రాలేదు.
Kanchi Narasimha Rao: దశాబ్దాల పాటు ఎన్నో సినిమాల్లో నటించినా రానటువంటి అరుదైన గుర్తింపును, ఒకే ఒక్క సినిమా.. ఒకే ఒక్క డైలాగ్ తెచ్చిపెట్టింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో తనదైన ముద్ర వేసి, నేటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఆ దిగ్గజ నటుడే కంచి నరసింహారావు. ఆయనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాయాబజార్. ఎందరో దిగ్గజ నటులు ఉన్నప్పటికీ... ఆ ఒక్క డైలాగ్ నరసింహారావుకు మంచిపేరు తెచ్చిపెట్టింది.
సినీ ప్రస్థానం ... తొలి అడుగులు
1912లో జన్మించిన కంచి నరసింహారావు మొదట రంగస్థలంపై అద్భుత నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత 1934లో సినీ రంగంలోకి ప్రవేశించి, 1935లో విడుదలైన ‘హరిశ్చంద్ర’ చిత్రంలో కాలకౌశికుడి పాత్రతో వెండితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పట్లో వచ్చిన ఎన్నో ప్రముఖ చిత్రాల్లో ఆయన నటించారు. ఏవీఎం సంస్థ నిర్మించిన ‘జీవితం’ (1950), ‘దొంగరాముడు’ (1955), ‘కన్యాశుల్కం’ (1955), ‘చక్రపాణి’ (1954), ‘దేవదాసు’ (1953), ‘దక్షయజ్ఞం’ (1941) వంటి సుమారు 6 ఏళ్లకు పైగా ప్రసిద్ధ చిత్రాల్లో ఆయన భాగమయ్యారు. అయినప్పటికీ, ఆయన రూపురేఖలకు తగ్గ పాత్రలే లభించడం వల్ల అనుకున్నంత స్థాయిలో పెద్ద గుర్తింపు రాలేదు.
‘మాయాబజార్’ మలుపు
ఆయన సినీ జీవితం మొత్తాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన చిత్రం మాత్రం 1957లో విడుదలైన అద్భుత దృశ్యకావ్యం ‘మాయాబజార్’. ఆ సినిమాలో శ్రీకృష్ణుడి వృద్ధ వేషంలో ఆయన కనిపించిన తీరు అసాధారణం. ఘటోత్కచుడితో ఆయన పలికిన "అటు నేనే ఇటు నేనే... చిరంజీవ సుఖీభవ" అనే ఆ ఒక్క డైలాగ్ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. వేదం చదివినట్లుండే ఆయన స్వచ్ఛమైన స్వరం, అచ్చమైన ఉచ్ఛారణ, పాత్రలో పూర్తిగా లీనమయ్యే నైపుణ్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఎన్ని సినిమాలు చేసినా దక్కని చిరకీర్తిని ఈ ఒక్క పాత్ర ఆయనకు తెచ్చిపెట్టింది. నటనపై ఆయనకున్న అంకితభావం, స్వచ్ఛమైన అభినయం నేటి తరానికి కూడా ఆదర్శమే.



