Jandhyala: పరకాయ ప్రవేశంపై జంధ్యాలకు ఎంత పట్టుందో... ఈ సినిమానే సాక్ష్యం

జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'రావూ-గోపాల్రావూ' సినిమా పరకాయ ప్రవేశం కాన్సెప్ట్‌ను వినోదాత్మకంగా ఉంటుంది. రావు గోపాలరావు, చంద్రమోహన్‌లు తమ టైమింగ్‌ కామెడీతో అలరించారు.

Balachander
Published on: 7 July 2026 11:00 AM IST
Jandhyala: పరకాయ ప్రవేశంపై జంధ్యాలకు ఎంత పట్టుందో... ఈ సినిమానే సాక్ష్యం
X

Jandhyala: సాధారణంగా 'పరకాయ ప్రవేశం' అనే ఇతివృత్తం అనగానే మనకు సోషియో ఫాంటసీ లేదా హర్రర్ సినిమాలు గుర్తొస్తాయి. కానీ, అంతటి గంభీరమైన కాన్సెప్ట్‌ను తీసుకుని ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా మలచడం ఒక్క హాస్య బ్రహ్మ జంధ్యాలకే సాధ్యమైంది. 1980ల నాటి ఈ క్లాసిక్ కామెడీ చిత్రంలో రావు గోపాలరావు, చంద్రమోహన్‌ల నటన తెలుగు చలనచిత్ర చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బాడీ లాంగ్వేజ్ కామెడీగా నిలిచింది. ఇద్దరు అగ్ర నటులు ఒకరి శరీరంలోకి ఒకరు మారినప్పుడు పండించిన నవ్వులు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నాయి.

కథలోని అసలు ట్విస్ట్ ఇదే

చరిత్ర ప్రొఫెసర్ గోపాలరావు రాత్రింబవళ్లు ఇల్లు, ఒళ్లు మర్చిపోయి 'పరకాయ ప్రవేశం'పై రీసెర్చ్ చేస్తుంటాడు. అదే కాలేజీలో చదువుపై అస్సలు శ్రద్ధ లేని జల్సా విద్యార్థి రామారావు. ఒక అర్ధరాత్రి వేళ ప్రొఫెసర్ గారు మంత్రాల సాయంతో తన ఆత్మను కోతి శరీరంలోకి పంపడం రామారావు చూస్తాడు. కుతూహలంతో రామారావు కూడా అదే మంత్రాలు చదివి ప్రొఫెసర్ శరీరంలోకి దూరిపోతాడు. ఫలితంగా ప్రొఫెసర్ ఆత్మ విద్యార్థి శరీరంలోకి, విద్యార్థి ఆత్మ ప్రొఫెసర్ శరీరంలోకి మారుతుంది. ఆ తర్వాత వారిద్దరి ఇళ్లలో జరిగిన గందరగోళమే ఈ సినిమా కథాంశం.

మరపురాని అద్భుతమైన కామెడీ ట్రాకులు

రామారావు తండ్రిగా పీఎల్ నారాయణ, తల్లిగా రాధాకుమారి నటించారు. ఇంట్లో ఏ పాత బట్ట కనిపించినా దాన్ని స్టీలు సామాన్లవాడికి ఇచ్చేసి స్పూన్లు, గిన్నెలు మార్చుకునే వింత అలవాటు భార్యకు ఉంటుంది. సినిమా మొదట్లో పంచె, లాల్చీతో రాజసంగా ఉండే పీఎల్ నారాయణ, భార్య పుణ్యమా అని చివరకు కేవలం బొందు లాగూతో మిగలడం ప్రేక్షకులకు పొట్టచెక్కలయ్యే హాస్యాన్ని పంచుతుంది. అంతేకాదు, నటి శ్రీలక్ష్మి 'L' బోర్డు తగిలించిన మొపెడ్ బండి నడుపుతూ ఊరంతా తిరుగుతుంటుంది. ఆమె బండి ఆపినప్పుడు స్టాండ్ వేయడానికి, కింద పడిపోతే లేపడానికి ఆమె వెనుక ఒక వ్యక్తి ప్రత్యేకంగా పరిగెత్తుకుంటూ వచ్చే ట్రాక్ ఎవర్గ్రీన్ కామెడీ.

ఈ సినిమాలో సుత్తివేలు రెండు భిన్నమైన చిన్న పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి ప్రొఫెసర్ మానసిక స్థితిని పరీక్షించడానికి వచ్చే ఫేక్ మెంటల్ డాక్టర్ పాత్ర కాగా, మరొకటి క్లైమాక్స్‌లో వారిద్దరూ తిరిగి సొంత శరీరాల్లోకి మారడానికి వాహకంగా ఉపయోగపడే 'శవం' పాత్ర. సినిమాలో ఎక్కడా ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ అంటూ లేకుండా, కథలోనే హాస్యాన్ని అంతర్భాగం చేసి జంధ్యాల గారు అద్భుతంగా వండి వడ్డించిన చిత్రం 'రావూ - గోపాల్రావూ'. ఈ తరం ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా నచ్చే ఒక చక్కని క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీలు చాలా అరుదుగా మాత్రమే వస్తుంటాయి. ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించే క్లాసికల్‌ కామెడీ సినిమా ఇది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story