హైదరాబాద్ సినిమా లవర్స్‌కు పూనకాలే.. మహేష్ బాబు ‘ఏఎంబీ క్లాసిక్’లోకి ఐమాక్స్ ఎంట్రీ!
Hyderabad: హైదరాబాద్‌లోని సినిమా లవర్స్‌కు ఇంతకంటే బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ మరొకటి ఉండదు.
హైదరాబాద్ సినిమా లవర్స్‌కు పూనకాలే.. మహేష్ బాబు ‘ఏఎంబీ క్లాసిక్’లోకి ఐమాక్స్ ఎంట్రీ!
Hyderabad: హైదరాబాద్‌లోని సినిమా లవర్స్‌కు ఇంతకంటే బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ మరొకటి ఉండదు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉన్న ‘హైదరాబాద్‌కు ఐమాక్స్ స్క్రీన్ పునరాగమనం’ వార్తపై అధికారిక ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సహ భాగస్వామిగా ఉన్న ప్రముఖ మల్టీప్లెక్స్ బ్రాండ్ ‘ఏఎంబీ సినిమాస్’వేదికగా ఈ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఐకానిక్ థియేటర్ ‘సుదర్శన్’ స్థానంలో రాబోతున్న ‘ఏఎంబీ క్లాసిక్ సుదర్శన్’లో ఈ ప్రతిష్టాత్మక ఐమాక్స్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఆసియన్ సినిమాస్ - ఐమాక్స్ కార్పొరేషన్ మెగా డీల్!
ప్రముఖ అంతర్జాతీయ సినీ పత్రిక 'వెరైటీ ఇండియా' కథనం ప్రకారం.. ఐమాక్స్ కార్పొరేషన్ , ఆసియన్ సినిమాస్ సంస్థలు భారతదేశంలో మూడు సరికొత్త ‘ఐమాక్స్ విత్ లేజర్’ఏర్పాటు చేయడానికి ఒక భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఏఎంబీ సినిమాస్ బ్రాండ్ అండర్ లో రాబోతున్న ఈ మూడు స్క్రీన్లలో.. మొట్టమొదటి స్క్రీన్‌ను హైదరాబాద్‌లోని ఏఎంబీ క్లాసిక్ వేదికగా ప్రారంభించనున్నారు. ఈ థియేటర్ ను 2026 చివరి నాటికి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.
11 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రసాద్స్ ఐమాక్స్ జ్ఞాపకాలు!
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ‘ప్రసాద్స్ ఐమాక్స్’భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే, సాంకేతిక కారణాల వల్ల 2015లో ప్రసాద్స్ గ్రూప్ ఐమాక్స్ ఫార్మాట్‌ను నిలిపివేసింది. అప్పటినుండి దాదాపు 11 ఏళ్లుగా హైదరాబాద్ ప్రేక్షకులు ఒక ప్రాపర్ ఐమాక్స్ థియేటర్ అనుభూతి కోసం ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ విజువల్ వండర్స్ రిలీజ్ అయినప్పుడు పక్క రాష్ట్రాలైన బెంగళూరు, చెన్నైలకు వెళ్లి ఐమాక్స్ స్క్రీన్లపై సినిమాలు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏఎంబీ క్లాసిక్ పుణ్యమా అని ఆ లోటు తీరబోతోంది.
ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని ఇస్తాం: సునీల్ నారంగ్
ఈ మెగా డీల్‌పై ఏషియన్ సునీల్ నారంగ్ , భరత్ నారంగ్ స్పందిస్తూ.. "హైదరాబాద్ ప్రజలకు సినిమాపై ఉన్న ప్రాణం, ఆకలి సాటిలేనివి. అలాంటి లవ్లీ సిటీకి మళ్లీ ప్రతిష్టాత్మక ఐమాక్స్ ఫార్మాట్‌ను తీసుకురావడం ఏఎంబీ సినిమాస్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. క్వాలిటీకి, విజువల్ ఎక్సలెన్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఏఎంబీ సినిమాస్.. ప్రేక్షకులకు ఎల్లప్పుడూ బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే ఐమాక్స్‌తో చేతులు కలిపింది" అని పేర్కొన్నారు.
అలాగే ఐమాక్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జియోవన్నీ డాల్చి మాట్లాడుతూ.. "హైదరాబాద్ మాకు చాలా కీలకమైన నగరం. ఇప్పటివరకు అక్కడ మా స్క్రీన్ లేకపోవడం ఒక లోటు. ఐమాక్స్ సినిమా కోసం జనాలు గంటల తరబడి ప్రయాణాలు చేసి వేరే నగరాలకు వెళ్తున్నారని విన్నప్పుడు మా బ్రాండ్ డిమాండ్ చూసి సంతోషం వేసినా.. అంత పెద్ద సిటీలో మేం ఇంకా స్క్రీన్ పెట్టలేకపోయామా అని కాస్త బాధేసింది. ఇప్పుడు ఏఎంబీతో కలిసి పూర్తి చేస్తున్నాం" అని చెప్పుకొచ్చారు.




