April 1 Vidudala Movie: ఏప్రిల్ 1 విడుదల... అద్దె ఇళ్లు, నో మేకప్... వంశీ మార్కు క్లాసిక్ వెనుక అసలు కథ!
వంశీ ఏప్రిల్ 1 విడుదల సినిమా నేటికీ ఓ పాఠ్యపుస్తకమే. మేకప్ లేకుండా, ఓ చిన్న ప్రదేశంలో సహజసిద్ధంగా తీసిన ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
April 1 Vidudala Movie: తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు ఎప్పటికీ వాడిపోని వసంతాలు. అలాంటి ఒక అద్భుతమైన హాస్య భరిత సృజన... దర్శకుడు వంశీ తెరకెక్కించిన 'ఏప్రిల్ 1 విడుదల'. అప్పట్లో థియేటర్ల బయట ఈ సినిమా పోస్టర్ చూసి, చాలా మంది అది ఏప్రిల్ 1న విడుదలయ్యే సినిమా ఏమో అనుకుని పొరబడ్డారు. తీరా చూస్తే సినిమా పేరే అది అని తెలిసి ఆశ్చర్యపోయారు. 'సత్యహరిశ్చంద్రుడు అబద్ధమాడితే' అనే నవల ఆధారంగా పుట్టుకొచ్చిన ఈ సినిమా, కేవలం ఒకే ఒక్క రాజమండ్రి రైల్వే కాలనీ నేపథ్యంలో షూటింగ్ జరుపుకుని టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. నిత్యం అబద్ధాలు చెప్తూ కాలం వెళ్లదీసే ఓ ప్రబుద్ధుడు, తను ప్రేమించిన అమ్మాయి కోసం 30 రోజుల పాటు 'కేవలం నిజాలే చెప్పాలి' అనే కఠినమైన షరతుకు ఒప్పుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్నదే ఈ చిత్ర ప్రధానాంశం.
రాజమండ్రి రైల్వే కాలనీలో 50 ఇళ్ల మాయాజాలం!
సాధారణంగా దర్శకుడు వంశీ సినిమా అంటే గోదావరి తీరం, కోనసీమ పచ్చదనం మన కళ్లముందు కదలాడుతాయి. కానీ, ఈ సినిమా కోసం ఆయన ఒక భిన్నమైన ప్రయోగం చేశారు. రాజమండ్రిలోని రైల్వే కాలనీని సినిమాకు ప్రధాన లొకేషన్‌గా మార్చేశారు. పెద్ద పెద్ద సెట్లు వేయకుండా, రైల్వే కాలనీలోని దాదాపు 50 ఇళ్లను షూటింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు. నాడు ఆ ఇళ్లలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉంటూ, చుట్టుపక్కల వారితో కలిసిపోయి సహజంగా చిత్రీకరణ జరిపారు. సినిమాలో పాత్రలు వీలైనంత సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో, వంశీ ఏ ఒక్క నటుడికీ మేకప్ వేయలేదు. కేవలం ముఖం కడుక్కుని కెమెరా ముందుకు వచ్చేయడమే! దీంతో సినిమా రంగుల హడావుడి లేకుండా చాలా వరకు సహజసిద్దంగా వచ్చింది.
కథనం అద్భుతం.. సాంకేతిక బలం!
నిజానికి ఇందులో చెప్పుకోదగ్గ పెద్ద కథ ఏమీ లేదు. కానీ, వంశీ రాసుకున్న స్క్రీన్‌ప్లే ప్రేక్షకుడిని సీటుకు కట్టిపడేస్తుంది. నిజం చెప్పడం వల్ల మనుషుల ముసుగులు ఎలా ఊడిపోతాయో, తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఎలా వస్తుందో ఇందులో ఎంతో హాస్యాస్పదంగా చూపించారు. ఈ సినిమాలకు ప్రధాన బలం ఎల్బీ శ్రీరామ్ అందించిన పదునైన, నవ్వులు పూయించే సంభాషణలు, రెండోది మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం. నేటికీ టీవీల్లో వస్తే ఛానల్ మార్చకుండా చూసేలా ఈ చిత్రాన్ని వంశీ తీర్చిదిద్దిన విధానం, సినిమా తీయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక పాఠ్యపుస్తకం లాంటిది. ఈ స్టోరీ చదివిన తరువాత మీకు కూడా వంశీ ఏప్రిల్ 1 విడుదల చూడాలనిపిస్తుంది కదా. చూసేయండి.




