Savitri Screen Presence: సావిత్రి నటప్రస్థానంలో అదృశ్యశక్తి... ఆమె లేకుంటే
వెండితెరపై మహానటి అంటే గుర్తుకు వచ్చేది సావిత్రి. అభినయం, ఆంగీరకం, వాచకం అన్నింటిలోనూ తనదైన ముద్రను వేసుకున్న నటి ఆమె.
Savitri Screen Presence: వెండితెరపై మహానటి అంటే గుర్తుకు వచ్చేది సావిత్రి. అభినయం, ఆంగీరకం, వాచకం అన్నింటిలోనూ తనదైన ముద్రను వేసుకున్న నటి ఆమె. సినీ రంగంలో విజయం సాధించడంలో ఆమె ప్రతిభ ఎంత ఉందో, ఆ ప్రతిభకు మెరుగులు దిద్దడంలో ఓ అదృశ్యశక్తి పాత్ర కూడా అంతే ఉంది. ఆ అదృశ్యశక్తి పేరు దాక్షాయణి. సావిత్రి వ్యక్తిగత సహాయకురాలిగా చివరి వరకు ఆమె పక్కనే ఉన్నారు. షూటింగ్ సమయంలో సావిత్రి కంటిన్యూటీని చూసుకోవడంలో ప్రముఖ పాత్రను పోషించారు.
ఒక పుస్తకం.. వేల జ్ఞాపకాలు
సినీ రంగంలో కంటిన్యూటీ అనేది చాలా క్లిష్టమైన విషయం. ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగినా సీన్ మొత్తానికి మోసం వస్తుంది. ఒక సీన్లోని కొంతభాగం ఈరోజు తీస్తే...దానికి కొనసాగింపుగా ఉండే సీన్ మరుసటి రోజు తీయవచ్చు లేదా నెల రోజుల తరువాత తీయవచ్చు. అలా ఎప్పుడు తీసినా ఆ కంటిన్యూటీ మిస్ కాకూడదు. చీరకట్టు, ధరించిన నగలు ఏ మాత్రం మారినా తెలిసిపోతుంది. ఈ విషయంలో సావిత్రి వ్యక్తిగత సహాయకురాలు దాక్షాయణి ఓ రికార్డును మెయింటైన్ చేసేవారట. ఏ షాట్లో ఏ చీర కట్టారు, ఏ నగలు పెట్టుకున్నారు అనే విషయాలను ఓ డైరీలో రాసుకునేవారు. అసోసియేట్ దర్శకులతో చర్చించి వివరాలు సేకరించేవారట. ఇలా వ్యక్తిగత సహాయకురాలి చొరవ కారణంగానే ఏ సినిమాలోనూ సావిత్రి తన కంటిన్యూటీ మిస్ కాలేదు.
సింగపూర్ హైహీల్స్.. ఆసక్తికర రహస్యం!
'చదువుకున్న అమ్మాయిలు' సినిమా చిత్రీకరణ సమయంలో ఒక ఆసక్తికరమైన సమస్య ఎదురైంది. ఆ సినిమాలో సావిత్రితో పాటు కృష్ణ కుమారి, ఈవీ సరోజ నటించారు. వీరిద్దరూ సావిత్రి గారి కంటే ఎత్తుగా ఉండేవారు. ఫ్రేమ్‌లో అందరూ సమానంగా కనిపించడం కోసం సావిత్రి గారి కోసం ప్రత్యేకంగా సింగపూర్ నుండి హైహీల్ చెప్పులను తెప్పించారు దాక్షాయణి. అయితే ఆ చెప్పులు ధరించిన విషయం ఎవరికీ తెలియకూడదు. అందుకే దాక్షాయణి గారు ఒక రహస్య కోడ్ భాషను వాడేవారు. షూటింగ్ సమయంలో సావిత్రికి ఆ చెప్పులు అందించాల్సి వచ్చినప్పుడు, అందరి ముందు "అక్కా.. అందులో చిరుగు ఉంది" అని చెప్పేవారు. అది వినగానే సావిత్రి ఆ చెప్పులు వేసుకోవాలని అర్థం చేసుకునేవారు. ఇలా ఎంతో చాకచక్యంగా సావిత్రి ఇమేజ్‌కు ఎక్కడా భంగం కలగకుండా దాక్షాయణి సహాయపడేవారు.
ఒక కళాకారిణి ప్రపంచం మెచ్చే నటిగా మారాలంటే కేవలం నటన ఒక్కటే సరిపోదు. ఆమె ఆహార్యం, క్రమశిక్షణ కూడా తోడవ్వాలి. సావిత్రి విషయంలో దాక్షాయణి ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వహించారు. నేటి తరం నటీనటులకు కూడా ఆ కాలం నాటి క్రమశిక్షణ, పని పట్ల ఉన్న అంకితభావం ఒక గొప్ప పాఠం. తెరపై సావిత్రి కనిపిస్తే, తెర వెనుక ఆమెను సిద్ధం చేసిన దాక్షాయణి కూడా ఆ అద్భుతంలో భాగస్వామే. సావిత్రి నుంచే నేటితరం తారలు తమ వ్యక్తిగత సహాయకుల సహకారంతో కంటిన్యూటీ మిస్ కాకుండా చూసుకుంటున్నారు. ఈరోజుల్లో అంటే అంతా టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఒకసీన్ తీయడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. కంటిన్యూటీ మిస్ అవుతుందన్న భావన రావడం లేదు.




