Nidhhi Agerwal Birthday: క్రేజీ ఆఫర్లు, ల్యాండ్‌మార్క్ హిట్లు.. గ్లామర్ క్వీన్ ప్రయాణం!
Nidhhi Agerwal Birthday: గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ ప్రయాణం, 'ఇస్మార్ట్ శంకర్' హిట్ నుండి ప్రభాస్, పవన్ కళ్యాణ్ చిత్రాల వరకు బిగ్ ప్రాజెక్ట్‌లపై ప్రత్యేక కథనం.
Nidhhi Agerwal Birthday: క్రేజీ ఆఫర్లు, ల్యాండ్‌మార్క్ హిట్లు.. గ్లామర్ క్వీన్ ప్రయాణం!
Nidhhi Agerwal Birthday Special: గ్లామర్‌కు సరికొత్త నిర్వచనం చెప్తూ, వైవిధ్యమైన పాత్రలతో శ్రోతలను, ప్రేక్షకులను అలరిస్తున్న భామ నిధి అగర్వాల్. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, తెలుగు, తమిళ భాషల్లో పవర్ ఫుల్ కాంబినేషన్లలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఈ రోజు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ ప్రయాణం, ల్యాండ్‌మార్క్ సినిమాలు, రాబోయే భారీ ప్రాజెక్ట్‌లపై ప్రత్యేక కథనం.
మోడలింగ్ రంగం నుంచి 'మున్నా మైఖేల్' సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయమైన నిధి అగర్వాల్, అక్కినేని నాగచైతన్య సరసన వచ్చిన 'సవ్యసాచి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచుకున్నారు. ఆ తర్వాత అఖిల్ అక్కినేనితో కలిసి నటించిన 'మిస్టర్ మజ్ను' చిత్రంలో తన గ్లామర్, క్యూట్ పర్ఫార్మెన్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
నిధి అగర్వాల్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్'. ఈ చిత్రంలో న్యూరో సైంటిస్ట్ డాక్టర్ సారా పాత్రలో మాస్, క్లాస్ ప్రేక్షకులను ఏకకాలంలో మెప్పించారు. రామ్ పోతినేనితో ఆమె ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, డ్యాన్స్ మూవ్స్ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ సినిమా విజయం తర్వాత నిధి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
తమిళంలో శింబు సరసన 'ఈశ్వరన్', జయం రవితో 'భూమి' చిత్రాల ద్వారా కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు నిధి. అతి తక్కువ సమయంలోనే అక్కడ విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. ఎంతలా అంటే, తమిళనాడులోని అభిమానులు ఏకంగా ఆమె కోసం ఒక ఆలయాన్నే నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్టించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే తెలుగులో పవన్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన కూడా ఈ అమ్మడు నటించింది.
ప్రస్తుతం నిధి అగర్వాల్ తన కెరీర్లోనే అత్యంత భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తన గ్లామర్‌తో మాత్రమే కాక, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ బిగ్ బడ్జెట్ సినిమాలతో పాన్-ఇండియా స్థాయికి ఎదుగుతున్న నిధి అగర్వాల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.




