Tollywood: కలరింగ్ పోస్టర్లు.. ఖాళీ థియేటర్లు.. నిండా ముంచిన ఆ రెండు సినిమాలు!

Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో ఫేక్ కలెక్షన్ల పోస్టర్ల ట్రెండ్ పెరిగిపోతోంది.

Naresh.k
Published on: 9 July 2026 8:56 AM IST
Tollywood
X

Tollywood: కలరింగ్ పోస్టర్లు.. ఖాళీ థియేటర్లు.. నిండా ముంచిన ఆ రెండు సినిమాలు!

Fake Posters: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. సినిమా ఎలా ఉందనే దానితో సంబంధం లేదు.. థియేటర్లలో జనాలు ఉన్నారా లేదా అనే విషయంతో అస్సలు పనిలేదు. మా సినిమా బ్లాక్‌బస్టర్.. మా కలెక్షన్లు మైండ్ బ్లోయింగ్ అంటూ కలరింగ్ పోస్టర్లు వేసేస్తే సరిపోతుంది. ఇటీవల టాలీవుడ్‌లో వచ్చిన రెండు సినిమాల విషయంలో ఇదే సీన్ రిపీట్ అయింది. చూసిన ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తూ మిక్స్‌డ్ టాక్ ఇచ్చినా, మేకర్స్ మాత్రం మా సినిమా హిట్ అంటే.. కాదు కాదు సూపర్ హిట్ అంటూ తెగ పబ్లిసిటీ చేసుకున్నారు. తీరా థియేటర్ల దగ్గరకు వెళ్తే ఈగలు తోలుకునే పరిస్థితి.. కానీ సోషల్ మీడియాలో మాత్రం వందల కోట్ల పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

సినిమా రిలీజ్ కాగానే 50 కోట్లు, 100 కోట్లు అంటూ భారీ అంకెలతో పోస్టర్లు దిగిపోతాయి. కానీ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రెండు సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు భారీ నష్టాలనే మిగిల్చాయనే టాక్ నడుస్తోంది. పెట్టిన పెట్టుబడి వెనక్కి రాక బయ్యర్లు నెత్తీ నోరు మొత్తుకుంటుంటే, నిర్మాతలు మాత్రం సక్సెస్ మీట్లు పెట్టి కేకులు కట్ చేస్తున్నారు.

ఇటీవలే ఒక ప్రముఖ నిర్మాత బహిరంగంగానే ఈ విషయాన్ని బద్దలు కొట్టారు. ఫలానా సినిమాకు అన్ని కోట్లు వచ్చాయంటే నమ్మకండి.. అవన్నీ ఉత్తి అబద్ధాలే, కేవలం ప్రచారం కోసమే ఆ నంబర్లు వేస్తున్నారు అని పబ్లిక్‌గా తేల్చేశారు. దీన్ని బట్టి ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు కలిసి ప్రేక్షకులను ఎంతలా బురిడీ కొట్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సినిమా కంటెంట్‌లో క్వాలిటీ ఉండదు కానీ, ప్రచారంలో మాత్రం క్వాలిటీ కలరింగ్‌ ఇస్తున్నారు.

సినిమా సరిగ్గా తీసి ప్రేక్షకుడిని మెప్పించడం చేతకావడం లేదు కానీ, టికెట్ల ధరలు పెంచి జేబులు గుల్ల చేయడం మాత్రం బాగా అలవాటైంది. సినిమాకు కాస్త హైప్ రాగానే చాలు.. ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి టికెట్ రేట్లు పెంచేసుకుంటున్నారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే ఒక సామాన్య కుటుంబానికి వేలల్లో ఖర్చవుతోంది. అంత డబ్బు పెట్టి వెళ్తే అక్కడ కంటెంట్ ఏమో నిల్'.. పబ్లిసిటీ ఏమో ఫుల్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ప్రేక్షకుడి నుంచి ఎంతవరకు డబ్బులు గుంజేయాలనే చూస్తున్నారు తప్ప, కనీస వినోదాన్ని పంచాలనే ఆలోచన మేకర్స్‌లో కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్క విషయం మాత్రం టాలీవుడ్ మేకర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి ప్రేక్షకుడు చాలా స్మార్ట్. ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రపంచ సినిమాను చూస్తున్నాడు. కేవలం పోస్టర్ల మీద వందల కోట్లు వేసేస్తే థియేటర్లకు పరిగెత్తుకుంటూ వచ్చే రోజులు పోయాయి. థియేటర్‌లో బొమ్మ దద్దరిల్లితేనే కలెక్షన్లు వస్తాయి తప్ప, ప్రెస్ మీట్లలో డబ్బా కొట్టుకుంటే థియేటర్లు నిండవు. ఇప్పటికైనా ఈ ఫేక్ ప్రచారాలు ఆపేసి, టికెట్ ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచి, క్వాలిటీ సినిమాలు తీయడంపై దృష్టి పెడితేనే టాలీవుడ్‌కు, బయ్యర్లకు మంచి రోజులు వస్తాయి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story