Dr K Shivaramakrishnayya: వెండితెరపై హాస్యం పంచిన ఫ్యామిలీ డాక్టర్
వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ శివరామకృష్ణయ్య సినీ రంగంలోనూ తనదైన ముద్రను వేసుకున్నాడు. హాస్యాన్ని పండిస్తూనే వైద్యం అందించారు.
Dr K Shivaramakrishnayya: వృత్తిపరంగా వైద్యం చేస్తూ...ప్రవృత్తిపరంగా వెండితెరపై హాస్యాన్ని పంచిన నటుడు ఎవరో తెలుసా? రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వైద్యవృత్తిని, సినీ రంగాన్ని పక్కన పెట్టి యుద్ధంలో సైనికులకు వైద్యసహాయం అందించిన దేశభక్తుడి గురించి మీరు విన్నారా...?
తెరపై తమ అద్భుతమైన హాస్యంతో ప్రేక్షకులను మైమరపించిన నటులు ఎందరో ఉన్నారు. కానీ, నిజ జీవితంలో నిజమైన డాక్టరుగా సేవలు అందిస్తూనే, వెండితెరపై హాస్య రసాన్ని పండించిన అరుదైన వ్యక్తిత్వం మాత్రం డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్యగారిది. నాటకరంగం నుంచి వెండితెరకు పరిచయమై, 80కి పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పుటను లిఖించుకున్నారు.
రంగస్థలం నుంచి వెండితెర దాకా...
డాక్టర్ శివరామకృష్ణయ్య 1889వ సంవత్సరంలో తెనాలిలో జన్మించారు. ప్రాథమిక విద్య అనంతరం విశాఖపట్నం మెడికల్ కాలేజీలో ఎల్‌ఎంపీ పూర్తి చేసి డాక్టరుగా పట్టా పొందారు. అయితే, 1918 నుంచి ఆయన నాటక రంగానికి ఆకర్షితులయ్యారు. రామదాసు, కబీరు, దుర్యోధనుడు, చాణక్యుడు వంటి అనేక పౌరాణిక, చారిత్రక పాత్రల్లో జీవించారు. పద్యాలు చదవడంలో, పాటలు పాడడంలో ఆయన దిట్ట. బళ్లారి రాఘవాచార్య, స్థానం నరసింహారావు వంటి మహానటులతో కలిసి నటించారు. నాటకాల అనుభవంతో ‘ద్రౌపదీ మాన సంరక్షణం’ చిత్రంలో కర్ణుడి పాత్ర ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘బలే పెళ్లి’, ‘ఒకరోజు రాజు’, ‘జీవన్ముక్తి’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి.
మిలిటరీ డాక్టరుగా సేవలు ... ‘పెళ్లి చేసి చూడు’తో బిగ్ బ్రేక్
సినిమాల్లో నటిస్తూనే ఆయన హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో మెడికల్ ప్రాక్టీస్ కొనసాగించారు. 1944లో రెండో ప్రపంచ యుద్ధ సమయాన మిలిటరీ డాక్టరుగా చేరి దాదాపు మూడు సంవత్సరాల పాటు సేవలు అందించారు. అనంతరం గుంటూరు వచ్చి తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే, 1951లో వచ్చిన ‘పెళ్లి చేసి చూడు’ చిత్రం ఆయన సినీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఇందులో ఎన్టీఆర్ తండ్రిగా ఆయన పోషించిన పాత్రలోని హాస్య చతురత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో ఆయన మద్రాసులోనే స్థిరపడ్డారు.
మరువలేని చిత్రాలు ... విలక్షణ నటన
‘పెళ్లి చేసి చూడు’ తర్వాత ఆయనకు వరుసగా హాస్య ప్రధానమైన పాత్రలే వచ్చాయి. ‘అమ్మలక్కలు’, ‘చక్రపాణి’, ‘అర్ధాంగి’, ‘అన్నదాత’, ‘బంగారు పాప’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘వారసత్వం’, ‘భక్త ప్రహ్లాద’, ‘ఉమా చండీగౌరీ శంకరుల కథ’ వంటి 80కి పైగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు నిరంతరం వినోదాన్ని అందించారు. అటు వైద్య వృత్తికి, ఇటు నటనా రంగానికి సమానంగా న్యాయం చేసిన డాక్టర్ శివరామకృష్ణయ్య తెలుగు తెరకు లభించిన అరుదైన నటుడు. వైద్యం శరీరానికి స్వస్థత చేకూరిస్తే...హాస్యం మనసుకు శాంతినిస్తుందని నిరూపించిన వైద్యనటుడు శివరామకృష్ణయ్య.




