Ram Charan: 'పెద్ది' కథ వెనుక ఉన్న అసలు సీక్రెట్ బయటపెట్టిన దర్శకుడు!
Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’.
Ram Charan: 'పెద్ది' కథ వెనుక ఉన్న అసలు సీక్రెట్ బయటపెట్టిన దర్శకుడు!
Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రంలోని మాస్ ఎలిమెంట్స్ , కథా నేపథ్యంపై దర్శకుడు బుచ్చిబాబు పంచుకున్న ఆసక్తికర విషయాలు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కమర్షియల్ మాస్ సీన్స్‌పై సరికొత్త ప్రయోగం
సాధారణంగా ఒక పెద్ద హీరో కమర్షియల్ సినిమాలో మాస్ సీన్ వస్తే అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఈలలు, గోలలు చేయడం చూస్తుంటామని బుచ్చిబాబు పేర్కొన్నారు. అయితే ‘పెద్ది’ సినిమాలో తాము చేసిన ప్రయోగం పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ఈ చిత్రంలోని మాస్ సన్నివేశాలు కేవలం రోమాంచితంగానే కాకుండా, ప్రేక్షకుల గుండెలను పిండేసే విధంగా ఉంటాయని వివరించారు. థియేటర్లలో ప్రేక్షకులు తమ కన్నీళ్లు తుడుచుకుంటూనే, ఆవేశంతో ఈలలు వేసేలా ఈ సీన్స్‌ను ఎంతో భావోద్వేగంతో రాసుకున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇది ఆయన బయోపిక్ కాదు…
గత కొంతకాలంగా ఈ సినిమా ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోందంటూ వస్తున్న ప్రచారానికి బుచ్చిబాబు పూర్తిగా తెరదించారు. ఇది ఆయన బయోపిక్ కాదని స్పష్టం చేశారు. తమ తూర్పుగోదావరి జిల్లాలో తాపి పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడే ‘పెద్దిరాజు’ అనే ఒక పేద యువకుడి నిజ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని, దానికి కాస్త కల్పిత కథను జోడించి ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రామ్‌చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా తూర్పుగోదావరి నేపథ్యంలో వచ్చినందున, ఈ సినిమా కోసం విజయనగరం వాతావరణాన్ని, అక్కడి యాసను ఎంచుకున్నట్లు చెప్పారు. అయితే కోడి రామ్మూర్తి నాయుడి గొప్పతనాన్ని నేటి తరానికి చూపించేందుకు సినిమాలో ఆయన ప్రస్తావన వస్తుందని, ఆయనకు శిష్యుడిగా కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ నటిస్తుండగా, శివన్నకు శిష్యుడిగా రామ్‌చరణ్ కనిపిస్తారని క్లారిటీ ఇచ్చారు.
‘ఉప్పెన’ కంటే ముందే పుట్టిన కథ
ఈ కథ ఎలా మొదలైందనే విషయంపై మాట్లాడుతూ, కొవిడ్ సమయంలో తన మొదటి చిత్రం ‘ఉప్పెన’ నేరుగా ఓటీటీ విడుదల చేయాలని అనుకున్నప్పుడు, దర్శకుడు సుకుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అడిగారని బుచ్చిబాబు గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలోనే తాను ‘పెద్ది’ లైన్ చెప్పగా, సుకుమార్ ఎంతో అభినందించి వెంటనే కథపై పని చేయమన్నారని చెప్పారు. అలా ‘ఉప్పెన’ విడుదల కాకముందే పిఠాపురంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో కూర్చుని ఈ కథాంశాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.
ఖుషి కపూర్ స్థానంలోకి జాన్వీ కపూర్
సినిమాలో కథానాయిక ఎంపిక వెనుక జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను కూడా బుచ్చిబాబు పంచుకున్నారు. మొదట ఈ పాత్ర కోసం శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్‌ను అనుకుని, ఆమెకు కథ చెప్పడానికి వెళ్ళినట్లు చెప్పారు. అయితే ఆమెను నేరుగా చూసిన తర్వాత, ఈ పల్లెటూరి పాత్రకు ఆమె సరిపోదనిపించిందని అన్నారు. ఇదే విషయాన్ని ఖుషి కపూర్ సోదరి జాన్వీ కపూర్‌కు వివరించి, చివరకు ఈ పాత్రకు జాన్వీని ఖరారు చేసినట్లు నవ్వుతూ వెల్లడించారు. రామ్‌చరణ్, జాన్వీ కపూర్ కలయికలో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది.




