Dhurandhar 2 Premiers: దురంధర్ 2 మూవీ తెలుగు వెర్షన్ ప్రీమియర్స్ ఉన్నట్టా? లేనట్టా?

Dhurandhar 2 Premiers: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ ల దురంధర్ 2 మూవీ ప్రీమియర్ షోలు రద్దయినట్టు తెలుస్తోంది. హిందీ తప్ప అన్ని భాషల్లోనూ ప్రీమియర్స్ ఆగిపోయినట్టు చెబుతున్నారు.

KVD Varma
Published on: 18 March 2026 3:44 PM IST
Dhurandhar 2 Premiers: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ ల దురంధర్ 2 మూవీ ప్రీమియర్ షోలు
X

Dhurandhar 2 Premiers

Dhurandhar 2 Premiers: దురంధర్ మూవీ సృష్టించిన సంచలనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఈలోగానే దీనికి సీక్వెల్ దురంధర్:ది రివెంజ్ థియేటర్లలోకి వచ్చేస్తోంది. మొదటి పార్ట్ కి మించి ఈ దురంధర్ 2 ఉంటుందని ట్రైలర్ తోనే పెద్ద అంచనాకు వచ్చేశారు ప్రేక్షకులు. మన దేశంలో ఏ మూవీకైనా సీక్వెల్ ఎప్పుడూ కూడా చాలా ఆలస్యంగా వస్తుంది. కానీ, దురంధర్ మూవీలోనే దాని సీక్వెల్ ఎప్పుడు వచ్చేదీ ప్రకటించేశారు. అన్నట్టుగానే రేపు (మార్చి 19న) మూవీ రిలీజ్ చేసేయడానికి సిద్ధం అయిపోయారు మేకర్స్.

దురంధర్ 2 మూవీ కోసం ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలు కూడా ప్రకటించారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. దాదాపుగా నాలుగు లక్షల టికెట్లు ప్రీమియర్ షోల కోసం బుక్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. అలా అడ్వాన్స్ బుకింగ్స్ లో సంచలనం సృష్టించింది దురంధర్ 2.

అయితే, ఇప్పుడు ప్రీమియర్ షోలు వేస్తారా? లేదా? అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. ఇప్పటికే తెలుగులో మూవీ ప్రీమియర్ షోల వివరాలు బుక్ మై షో యాప్ లో కనిపించడం లేదు. హిందీ వెర్షన్ కూడా చాలా స్క్రీన్స్ కనిపించడం మానేశాయి. కొన్ని స్క్రీన్స్ మాత్రమే ప్రీమియర్ షోలు కనిపిస్తున్నాయి. అసలేం జరిగింది?

సెన్సార్ సమస్యలు..

దురంధర్ 2 మూవీ సెన్సార్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ మూవీకి నిన్న అంటే మార్చి 17న సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ మూవీలో 21 మార్పులతో ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో మూవీకి పెద్ద ఇబ్బంది తలెత్తింది. ప్రీమియర్ షోస్ వేయాలంటే ముందు సెన్సార్ చెప్పిన 21 మార్పులు చేయాలి. ఉన్న కొద్దిపాటి సమయంలో అన్ని భాషల్లోనూ ఇలా చేయడం చాలా కష్టం. అందుకే ముందుగా హిందీ వెర్షన్ మార్పులు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందట మూవీ టీమ్. అయితే, ఈ వార్త రాస్తున్న సమయానికి ఉన్న సమాచారం ప్రకారం హిందీ వెర్షన్ లో కూడా ఫస్ట్ హాఫ్ వరకే ఈ మార్పులు చేయగలిగారట. ఇంకా సెకండ్ హాఫ్ మార్పులు చేసి.. దానిని డిజిటలైజ్ చేసి.. యూఎఫ్ఓ లో అప్ లోడ్ చేయాలి. దీనికి సమయం సరిపోయేలా కనిపించడం లేదని బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. దీంతో హిందీ మినహా మిగిలిన అన్ని భాషల్లోనూ మూవీ ప్రీమియర్ షోలు లేనట్లే అని తెలుస్తోంది. అందుకే టికెట్ బుకింగ్ యాప్స్ లో హిందీ మాత్రమే కనిపిస్తోందని చెబుతున్నారు.

ఇక హిందీ వెర్షన్ కూడా 5:30 గంటల షో పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయనేది అంచనా. ఈ నేపథ్యంలో 7 గంటలకు ఆ తరువాత షోలు హిందీ వెర్షన్ పడే ఛాన్స్ ఉంది. దురంధర్ 2 మూవీ ప్రీమియర్స్ చూడాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు పెద్ద నిరాశ ఎదురైంది. ఇక హిందీ వర్షన్ కోసం చూసేవారికి కూడా ప్రస్తుతం అయోమయ పరిస్థితి నెలకొని ఉంది.

మరో పక్క ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూవీపై మొదటి రివ్యూ ఇచ్చేశారు. షోలే సినిమా కంటే వంద రెట్లు ఎక్కువగా మూవీ ఉందంటూ ఆయన చెప్పడంతో దురంధర్ 2 పై తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిపోయింది.

KVD Varma

KVD Varma

Next Story