Daayra Movie: హైదరాబాద్ దిశ ఘటన ఆధారంగా ‘దాయరా’ మూవీ.? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Daayra Movie: కరీనా కపూర్ 'దాయరా' సినిమా దిశ ఘటన ఆధారంగా తీయలేదని డైరెక్టర్ మేఘనా గుల్జార్ స్పష్టం చేశారు.

Ravi
By Ravi
Published on: 3 Sept 2026 7:44 PM IST
Daayra Movie
X

Daayra Movie: హైదరాబాద్ దిశ ఘటన ఆధారంగా ‘దాయరా’ మూవీ.? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Daayra Movie: కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం 'దాయరా'. వాస్తవ సంఘటనల ఆధారంగా అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించే ప్రముఖ డైరెక్టర్ మేఘనా గుల్జార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ 'దిశ' అత్యాచారం, హత్య కేసు ఆధారంగానే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై డైరెక్టర్ మేఘనా గుల్జార్ క్లారిటీ ఇచ్చారు.

'దాయరా' సినిమా కేవలం ఒక్క దిశ కేసుకు సంబంధించిన కథ కాదని ఆమె స్పష్టం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన ఎన్నో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను అల్లినట్లు ఆమె తెలిపారు. సమాజంలో జరుగుతున్న దారుణాలను, మహిళల భద్రతను ప్రశ్నించేలా ఈ చిత్రాన్ని తీస్తున్నట్టు సమాచారం. గతంలో జరిగిన 2019 నవంబర్ 27వ తేదీ నాటి హైదరాబాద్ ఘటన దేశం మొత్తాన్ని తీవ్రంగా కలచివేసింది. 27 ఏళ్ల వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు మృగాళ్లు అతి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, అనంతరం దహనం చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 6వ తేదీన సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో, వారు పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు. ఈ సంఘటనల ప్రభావం కూడా ఈ సినిమాలో కొంత మేర కనిపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో 'రాజీ', 'ఛపాక్' లాంటి అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన మేఘనా గుల్జార్, ఇప్పుడు 'దాయరా' సినిమాను సుమారు రూ. 50 కోట్లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం హీరో హీరోయిన్లు సుమారు రూ. 5 కోట్లు నుంచి రూ. 10 కోట్లు వరకు పారితోషికం తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరూ పవర్‌ఫుల్ పోలీసు అధికారులుగా కనిపించనున్నారని టాక్.

మహిళల భద్రత, చట్టాల్లో ఉన్న లొసుగులు, న్యాయం కోసం జరిగే పోరాటం వంటి కీలక అంశాలను ఈ సినిమాలో ధైర్యంగా చూపించబోతున్నారు. పోలీసు వ్యవస్థ పనితీరు, నేరస్థులకు పడే శిక్షలు తదితర అంశాలను దర్శకురాలు కళ్లకు కట్టినట్లు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story