Jana Nayagan: 'జననాయగన్’ కంటెంట్ షేర్ చేస్తే చర్యలు… ఆరుగురి అరెస్ట్
Jana Nayagan: కోలీవుడ్ దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జననాయగన్’ విడుదలకు ముందే పైరసీ కోరల్లో చిక్కుకోవడం చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది.
Jana Nayagan: 'జననాయగన్’ కంటెంట్ షేర్ చేస్తే చర్యలు… ఆరుగురి అరెస్ట్
Jana Nayagan: కోలీవుడ్ దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జననాయగన్’ విడుదలకు ముందే పైరసీ కోరల్లో చిక్కుకోవడం చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. సినిమా లీక్ కావడంతో అప్రమత్తమైన సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పైరసీ కంటెంట్‌ను షేర్ చేసే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని చిత్రబృందం తరఫు న్యాయవాదులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు
తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నటిస్తున్న చివరి చిత్రం కావడంతో ‘జననాయగన్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తక్షణమే స్పందించిన నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కీలకమైన డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
షేర్ చేస్తే కటకటాలకే.. న్యాయవాదుల హెచ్చరిక
ఈ లీకేజీ వ్యవహారంపై చిత్రబృందం తరఫు న్యాయవాది సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. కేవలం లీక్ చేసిన వారే కాకుండా, ఆ దృశ్యాలను ఏ రూపంలోనైనా డౌన్లోడ్ చేసినా లేదా ఇతర గ్రూపులకు ఫార్వర్డ్ చేసినా వారిని కూడా నేరస్థులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. "పైరసీని ప్రోత్సహించే ప్రతి ఒక్కరినీ గుర్తించి తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటాం" అని నోటీసులో పేర్కొన్నారు. ప్రతి నెటిజన్ నిశిత పరిశీలనలో ఉన్నారని, చట్టపరమైన ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు.
అండగా నిలిచిన సినీ దిగ్గజాలు
సెన్సార్ సర్టిఫికెట్ ప్రక్రియలో జాప్యం కారణంగా విడుదల తేదీపై సందిగ్ధత కొనసాగుతున్న సమయంలో ఈ లీక్ ఘటన జరగడం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. విజయ్‌కు మద్దతుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్ర తారలు చిరంజీవి, కమల్‌హాసన్, రజనీకాంత్ వంటి వారు గళమెత్తారు. కష్టపడి నిర్మించిన సినిమాను పైరసీ చేయడం క్షమించరాని నేరమని, ఇలాంటి చర్యల వల్ల సినిమా రంగం కుప్పకూలిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
విజయ్ అభిమానుల్లో ఆందోళన
తమ అభిమాన హీరో చివరి సినిమా కావడంతో ‘జననాయగన్’ను వెండితెరపై చూడాలని కోట్లాది మంది అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో సినిమా లీక్ కావడం వారిని కలిచివేస్తోంది. పైరసీని అరికట్టడంలో పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా లీకైన వీడియోలు కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని అభిమాన సంఘాలు పిలుపునిస్తున్నాయి.




