Aditya Dhar: క్రికెటర్ కావాలనుకుని.. సూపర్ హిట్ సినిమాల దర్శకుడిగా..

Aditya Dhar: క్రికెటర్ కావాలనుకున్న యువకుడు.. సినిమా దర్శకుడయ్యాడు. మొదటి సినిమా అర్ధాంతరంగా ఆగిపోతే ఆ కారణంతోనే మూవీ తీసి హిట్ కొట్టాడు. ఆ స్టోరీ ఇదే..

KVD Varma
Published on: 15 March 2026 5:30 PM IST
Aditya Dhar: క్రికెటర్ కావాలనుకున్న యువకుడు.. సినిమా దర్శకుడయ్యాడు.
X

Aditya Dhar

Aditya Dhar: ఒక్కోసారి అలాగే అవుతుంది. జీవితంలో ఎదో కావాలని ప్రయత్నిస్తే.. మరేదో దొరుకుతుంది. సరిగ్గా ఇదే జరిగింది దురంధర్ మూవీ డైరక్టర్ ఆదిత్య ధర్ విషయంలో. ఆయనకు మొదట్లో సినిమాలపై పెద్ద అభిరుచి లేదు. క్రికెటర్ అవ్వాలని ప్రయత్నించారు. కానీ, ఫెయిల్ అయ్యారు. తర్వాత దర్శకుడు అయ్యారు. వరుసగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఉరి సినిమాతో దర్శకుడిగా నిరూపించుకుని.. దురంధర్ తో బాక్సాఫీస్ షేక్ చేసి.. ఇప్పుడు దురంధర్ 2తో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టే పనిలో పడ్డారు. అసలు ఆయన దర్శకుడు ఎలా అయ్యారు. ఈ స్టోరీలో తెలుసుకుందాం.

'ధురంధర్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించే ముందు, ఆదిత్య ఒకే ఒక్క చిత్రానికి దర్శకత్వం వహించాడు, అది కూడా బ్లాక్ బస్టర్. అది 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్'. ఆదిత్య ధర్ కాశ్మీరీ పండిట్. బాల్యంలో డిస్లెక్సియాతో బాధపడిన ఆదిత్య అంత తేలికగా ఈ స్థాయికి రాలేదు. చదువు ఇబ్బందిగా మారడంతో ఆదిత్య క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. క్రికెటర్ కావాలని కలలు కన్నారు. అందుకోసం క్రికెట్ కోచింగ్ కూడా తీసుకున్నారు. భారతదేశం తరపున క్రికెట్ ఆడాలనే కలతో ఆయన అండర్-19 జట్టుకు ట్రయల్స్ కూడా ఇచ్చారు. కానీ, కొన్ని రాజకీయ కారణాల వల్ల, భారత అండర్-19 జట్టులో స్థానం లభించలేదు. ఈ విషయాన్నీ ఆయనే ఒక ఇంటర్యూలో చెప్పారు. ఆ నిరాశలో, ఆయన క్రికెట్‌ను పక్కన పెట్టేశారు.

జీవిత గమనాన్ని మార్చిన గార్డిష్..

1993లో విడుదలైన 'గార్డిష్' సినిమాతో ఆదిత్య జీవితం మారిపోయింది. జాకీ ష్రాఫ్ నటించిన, ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 'గార్డిష్' సినిమా చూసి.. ఆదిత్య ధర్, తాను సినీ దర్శకుడిగా మారాలని నిర్ణయించుకుని చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. దర్శకుడు ప్రియదర్శన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. మొదట్లో కొన్ని కథలు కూడా రాశారు. కానీ అక్కడ కూడా కొన్ని అన్యాయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దర్శకుడు ప్రియదర్శన్ చెప్పినట్లుగా, మొదట్లో, ఇతరులు అతని కథలను దొంగిలించి తమవిగా వాడేసుకున్నారు. ఆదిత్య చేసిన పనికి కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదు.

కానీ ప్రియదర్శన్ తో కలిసి పనిచేయడం వల్ల అతను తనదైన ముద్ర వేశాడు. ప్రియదర్శన్ సినిమాలకు డైలాగ్స్ రాసేవారు. ప్రియదర్శన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా, ఆదిత్య చాలా మంచి రచయిత. ఆయన సినిమాలకు మంచి డైలాగ్స్ రాసేవారు.

కరణ్ జోహార్ ఫస్ట్ ఛాన్స్

ఆదిత్య ధర్ దర్శకుడిగా మారడానికి మొదట నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఛాన్స్ ఇచ్చారు. ఆదిత్య ధర్ 'రాత్ బాకి' అనే చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి కరణ్ జోహార్ నిర్మాత. కత్రినా కైఫ్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, పాకిస్తానీ నటుడు ఫహద్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు. కానీ అదే సమయంలో, ఉరి దాడి జరిగింది. పాకిస్తానీ నటులను తొలగించాలని కరణ్ పై ఒత్తిడి వచ్చింది. దీంతో ఆదిత్య దర్శకత్వం వహించాల్సిన ఈ 'రాత్ బాకి' చిత్రం ఆగిపోయింది.

ఈ సంఘటనతో ఆదిత్య నిరాశపడలేదు. డీలా పడిపోలేదు. మరింత పట్టుదల వచ్చింది. ఏ ఉరి కారణంగా తన మొదటి సినిమా ఆగిపోయిందో.. అదే ఉరి దాడిని కథాంశంగా మూవీ తీయాలని డిసైడ్ అయిపోయారు. ఉరి దాడుల గురించి, భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్‌ను ఇతివృత్తంగా చేసుకుని 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీకి విక్కీ కౌశల్ ను హీరోగా ఎంచుకున్నారు. అప్పట్లో ఈ ఎంపికపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎందుకంటే, ఆ సమయంలో విక్కీ కౌశల్ కమర్షియల్ హీరో కాదు. కానీ విక్కీపై నమ్మకంతో ఆదిత్య ఆయన్ను ఎంచుకున్నారు. ఆదిత్య భావించినట్టుగానే విక్కీ ఆ పాత్రకు ప్రాణం పోశాడు. తర్వాతేముంది.. విమర్శకుల నోళ్లు మూతలు పడ్డాయి. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' బ్లాక్ బస్టర్.

ఆ తర్వాత, కొన్ని చిత్రాలకు కథలు రాసి, సినిమాలు నిర్మించిన ఆదిత్య, ఆరు సంవత్సరాల తర్వాత 'ధురంధర్' సినిమా తీశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఇప్పుడు, అదే సినిమా సీక్వెల్ 'ధురంధర్ 2' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సంచలనమ్ సృష్టిస్తోంది ఈ మూవీ. విడుదలయ్యాకా ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతుందని సినీ విమర్శకులు సైతం భావిస్తున్నారు.

KVD Varma

KVD Varma

Next Story