Classic Telugu Cinema Dialogues: అతిశయోక్తి కాదు...అలాంటి అలంకరణలే సినిమాకు ఆభరణాలు

తెలుగు సినిమాల్లో కె. విశ్వనాథ్, జంధ్యాల వంటి దిగ్గజాలు ఉపయోగించిన అద్భుతమైన పదాలంకరణలు, అతిశయోక్తులు, సాహిత్య సౌందర్యం తెలుగు ప్రజల హృదయాల్లో ఎందుకు నిలిచిపోయాయో తెలుసుకుందాం.

Balachander
Published on: 13 Jun 2026 2:07 PM IST
Classic Telugu Cinema Dialogues: అతిశయోక్తి కాదు...అలాంటి అలంకరణలే సినిమాకు ఆభరణాలు
X

Classic Telugu Cinema Dialogues: తెలుగు భాషకు ఉన్న సౌందర్యమే వేరు. ముఖ్యంగా మన వెండితెరపై సంభాషణలు కేవలం మాటలుగా కాకుండా, అలంకారాలుగా మారినప్పుడు ఆ సినిమాలు కాలాతీత కళాఖండాలుగా నిలిచిపోతాయి. ‘సాగరసంగమం’ చిత్రంలో శైలజ నృత్య ప్రదర్శన పరిచయంలో వచ్చే “చిరుత ప్రాయంలోనే కాలికి మువ్వ కట్టి...” అనే డైలాగ్ దీనికి ఒక మచ్చుతునక. సీనియర్ నటుడు అరుణ్ కుమార్ పలికిన ఈ సంభాషణ వెనుక కళాతపస్వీ కె. విశ్వనాథ్ పద ప్రయోగం అద్భుతం. ఇక్కడ ‘చిరుత ప్రాయం’ అంటే కేవలం చిన్న వయసు అని మాత్రమే కాదు... చిరుతపులి లాంటి వేగం, లయ. కేవలం 8 నుండి 10 సంవత్సరాల సగటు ఆయుర్దాయం ఉన్న ఆ వన్యప్రాణిలాగా అతి తక్కువ ప్రాయంలోనే 20 అడుగుల ఎత్తుకు దూకగల సామర్థ్యాన్ని ఆ పాత్రకు ఆపాదించడం దీని వెనుక ఉన్న అంతరార్థం.

కళాతపస్వి, హాస్యబ్రహ్మల అక్షర విన్యాసాలు

ఒకప్పుడు ప్రేక్షకులు కేవలం కథ కోసమే కాదు, సరికొత్త పదబంధాలు, భాషా అలంకారాలు వినడానికి కూడా థియేటర్లకు వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. విశ్వనాథ్‌తో పాటు హాస్యబ్రహ్మ జంధ్యాల తమ చిత్రాలలో చేసిన పద ప్రయోగాలు కోకొల్లలు. శంకరాభరణం సినిమాలో శాస్త్రీయ సంగీతాన్ని కేవలం ఒక కళగా కాకుండా, జీవన వేదంగా చూపించారు. సంగీత క్షీరసాగర మథనం లాంటి పదాలు సాధారణ ప్రేక్షకుడి నోట కూడా నానాయంటే ఆ పదాలకున్న శక్తే కారణం. ఇక జంధ్యాల అహ నా పెళ్ళంట, పడమటి సంధ్యారాగం సినిమాలు చూస్తే తెలుగు భాషను ఎంత హాస్యస్పోరకంగా, వినసొంపుగా మార్చవచ్చో తెలుస్తుంది. లక్ష్మీపతి పాత్ర చేత సిత్రావిచిత్రాలు, శనిగ్రహమా, అరవీర భయంకర లాంటి పద ప్రయోగాలు నేటికీ మన నిత్యజీవితంలో వాడుకలో ఉన్నాయి.

మరికొన్ని చిత్రాల్లోని విలక్షణ పద ప్రయోగాలు

మాయాబజార్ సినిమాలో పింగళి నాగేంద్రరావు సృష్టించిన ‘అసమదీయులు’, ‘తస్మదీయులు’, ‘గింతంత నవనీతం’, ‘ఘటోత్కచ ప్రతాపం’ లాంటి పదాలు తెలుగు నిఘంటువులోనే లేవు. కానీ అవి తెలుగు వారి సంభాషణల్లో భాగమైపోయాయి. ఇక ఆధునిక కాలంలో వచ్చిన బాహుబలి సినిమాలో మహిష్మతి, అండపిండ బ్రహ్మాండం లాంటి పదబంధాలు, శతృవులను వర్ణించడానికి వాడిన సంస్కృత భూయిష్ట పదాలు సినిమా స్థాయిని పెంచాయి.

మన తెలుగబ్బాయిలు అమ్మాయిలను లేదా తాము ప్రేమించే కళను పొగడాలన్నా, శత్రువును హెచ్చరించాలన్నా భాషను ఎంతటి ఎత్తుకైనా తీసుకెళ్తారు. ‘ఒక్క దెబ్బ కొడితే ఒకటిన్నర టన్ను వెయిట్’ అనే ఆధునిక మాస్ డైలాగ్‌లకు మూలాలు... నాటి సినిమాల్లోని ‘చిరుత ప్రాయం’ లాంటి ఉపమానాల్లోనే ఉన్నాయి. ఇలాంటి భాషా అలంకరణలే తెలుగు సినిమాకు ఎప్పటికీ చెరిగిపోని ఆభరణాలని చెప్పవచ్చు. నాటి దర్శకులు సినిమాపై అభిమానం, భాషపై మక్కువతో ఇలాంటి ప్రయోగాలు చేశారు. ఈనాటి దర్శకులు కూడా భాషను వక్రీకరించకుండా భాషపై ఉన్న అభిమానంతో త్రివిక్రమ్‌ వంటి దర్శకులే కాకుండా యువ దర్శకులు కూడా భాషను అందంగా, హృదయానికి హత్తుకునే విధంగా చెబితే బాగుంటుంది. మన భాష పరాయి భాషతో పలాయనం చెందకుండా ఉంటుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story