Boddapati: మహానటులతో సరిసమానం... అలనాటి కళా వైభవానికి ఓ ప్రతిరూపం

తెలుగు ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి నటనా రంగంలో ఎదగి సినీ రంగంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చెరగని ముద్రవేసుకున్న నటుడు బొడ్డపాటి కృష్ణారావు.

Balachander
Published on: 28 July 2026 12:28 PM IST
Boddapati: మహానటులతో సరిసమానం... అలనాటి కళా వైభవానికి ఓ ప్రతిరూపం
X

Boddapati: ఒక నటుడు తన పూర్తి పేరు కంటే కేవలం ఇంటిపేరుతోనే కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసుకోవడం సినీ జగత్తులో అత్యంత అరుదైన మైలురాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాల స్వర్ణయుగంలో 'బొడ్డపాటి' అనగానే గుర్తుకువచ్చే నటుడు బొడ్డపాటి కృష్ణారావు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి, తెలుగు తెరపై చిన్న పాత్రలతోనే మహానటుల సరసన చెరిపేయలేని గుర్తింపు సంపాదించుకున్న అలనాటి నటుడి సినీ ప్రస్థానం ఎంతో ఆసక్తికరం!

నాటకరంగం నుంచి వెండితెరకు..

మచిలీపట్నంలోని సాంస్కృతిక వాతావరణంలో పెరిగిన కృష్ణారావు వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడు. బోధన అందిస్తూనే నాటకరంగంపై 'సుబ్బిశెట్టి' వంటి పాత్రలతో మెప్పించారు. నాటి ప్రముఖ కవి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి చేత ప్రశంసలు అందుకున్న ఆయన నటనా పటిమ ఆయన్ను వెండితెరకు నడిపించింది. 1954లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన 'అమర సందేశం' చిత్రం ద్వారా ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. అమర సందేశంతో ప్రారంభమైన ప్రయాణం 90కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఆయన నటించి మెప్పించారు.

మాయాబజార్' శంఖుతీర్థులుగా చెరగని ముద్ర

1957లో వచ్చిన కేవీ రెడ్డి అద్భుత సృష్టి ‘మాయాబజార్’ చిత్రంలో బొడ్డపాటి పోషించిన ‘శంఖుతీర్థులు’ పాత్ర ఇప్పటికీ సినీ ప్రియులకు నిత్యనూతన జ్ఞాపకమే! ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు, సావిత్రి, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి వంటి 20 మందికి పైగా దిగ్గజ నటులు ఉన్న ఆ క్లాసిక్ సినిమాలో, తన చిరు పాత్రతోనే ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు, 1955లో వచ్చిన దొంగరాముడు, 1956లో వచ్చిన ఏది నిజం, 1957లో పాండురంగ మహత్యం, 1958లో పెళ్లినాటి ప్రమాణాలు, 1962లో వచ్చిన గుండమ్మకథ, భీష్మ, ఆ తరువాత వచ్చిన శ్రీకృష్ణ తులాభారం, ఉమ్మడి కుటుంబం, మోసగాళ్లకు మోసగాడు వంటి పలు సినిమాల్లో నటుడిగా మెప్పించారు.

నటనకు నిలువుటద్దం

బొడ్డపాటి నటనలో ఎక్కడా అతిశయోక్తి ఉండేది కాదు. ఏ పాత్ర ఇచ్చినా జీవించడం ఆయన నైజం. నాటి 50, 60, 70ల కాలంలో కథకు బలాన్నిచ్చే క్యారెక్టర్ నటులలో ఆయన ఒకరిగా నిలిచారు. ఉపాధ్యాయుడిగా సమాజానికి విజ్ఞానాన్ని, నటుడిగా నాటక, సినీ రంగాలకు సహజ నటనను అందించిన 'బొడ్డపాటి కృష్ణారావు' పేరు తెలుగు చలనచిత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇలాంటి అరుదైన నటుల గురించి తెలుసుకోవడం మన ధర్మం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story