Balakrishna vs Nagarjuna: పదేళ్ల తర్వాత బాలకృష్ణ, నాగార్జున బాక్సాఫీస్ ఫైట్ ..ఆ హీరోదే పైచేయి!

Balakrishna vs Nagarjuna: క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న నందమూరి బాలకృష్ణ ‘దాదా’, అక్కినేని నాగార్జున ‘కింగ్ 100’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి.

Gagan kumar
Published on: 7 Sept 2026 9:10 AM IST
Balakrishna vs Nagarjuna
X

Balakrishna vs Nagarjuna: పదేళ్ల తర్వాత బాలకృష్ణ, నాగార్జున బాక్సాఫీస్ ఫైట్ ..ఆ హీరోదే పైచేయి!

Box Office Clash: తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి-అక్కినేని కుటుంబాల అనుబంధం ఎంతటి ప్రత్యేకమో, వెండితెరపై వీరి మధ్య సాగే పోటీ అంతకుమించిన ఉత్కంఠను రేకెత్తిస్తుంది. స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్నార్‌ల హయాం నుంచి మొదలైన ఈ ఆరోగ్యకరమైన బాక్సాఫీస్ సమరం, వారి నటవారసులు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జునల వరకు దశాబ్దాలుగా కొనసాగుతోంది.

తాజాగా ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు మరోసారి నేరుగా తలపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈసారి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఇద్దరి చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న NBK 111 చిత్రానికి ‘దాదా’ అనే మాస్ పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

అదే రోజున అక్కినేని నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా భావిస్తున్న 100వ చిత్రం ‘కింగ్ 100’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు సీనియర్ స్టార్ల మధ్య బాక్సాఫీస్ వార్ అనివార్యమైంది. చరిత్ర సృష్టించిన గత బాక్సాఫీస్ వివరాలను ఓసారి పరిశీలిస్తే బాలయ్య, నాగార్జునల మధ్య ఇప్పటివరకు దాదాపు పదిసార్లు నేరుగా బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోరు సాగింది.

1987 సంక్రాంతి: బాలయ్య ‘భార్గవరాముడు’, నాగ్ ‘మజ్ను’ చిత్రాలతో పోటీపడి సమానమైన ప్రభావాన్ని చూపారు. అదే ఏడాది నవంబర్‌లో వచ్చిన ‘కిరాయి దాదా’, ‘భానుమతి గారి మొగుడు’ రెండూ మంచి విజయాలు సాధించాయి.

1988 - 1989: 1988లో నాగార్జున ‘చినబాబు’, బాలయ్య ‘తిరగబడ్డ తెలుగుబిడ్డ’తో పోటీ పడ్డారు. 1989 అక్టోబర్‌లో నాగ్ ‘శివ’ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌సెట్టర్‌గా నిలవగా, బాలయ్య ‘బాలగోపాలుడు’ భారీ ఓపెనింగ్స్‌తో సత్తా చాటింది.

1991 - 1994: 1991 ఫిబ్రవరిలో బాలయ్య ‘తల్లిదండ్రులు’ చిత్రం, నాగ్ ‘నిర్ణయం’పై పైచేయి సాధించింది. 1994 ఏప్రిల్‌లో నాగార్జున డబుల్ యాక్షన్ మూవీ ‘హలో బ్రదర్’, బాలకృష్ణ జానపద చిత్రం ‘భైరవద్వీపం’ రోజుల వ్యవధిలో విడుదల కాగా రెండింటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

1996 - 2016: 1996 సంక్రాంతికి బాలయ్య ‘వంశానికొక్కడు’తో ఘనవిజయం సాధించారు. 2004లో ‘మాస్’తో నాగార్జున సంచలనం సృష్టించగా, చివరిగా 2016 సంక్రాంతికి బాలయ్య ‘డిక్టేటర్’తో రాగా, నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’తో విజయం సాధించారు.

ఇప్పుడు దశాబ్దం తర్వాత ఇద్దరు హీరోలు ఒకే తేదీన తమ చిత్రాలతో బరిలోకి దిగుతున్నారు. ముంబై మాఫియా డాన్‌గా బాలయ్య ‘దాదా’, తన ప్రతిష్టాత్మక ల్యాండ్‌మార్క్ మూవీగా నాగ్ ‘కింగ్ 100’తో ఢీకొడుతుండటంతో ఈ బాక్సాఫీస్ సమరంలో క్రిస్మస్ విజేతగా ఎవరు నిలుస్తారోనని సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story