Avika Gor: ఒంటరితనంపై నటి అవికా గోర్ ఎమోషనల్ పోస్ట్.. ‘ఎదుగుతున్న కొద్దీ నమ్మకమైన వారు దొరకడం కష్టమే’

Avika Gor: చుట్టూ వంద మంది ఉన్నా ఒంటరితనం ఎందుకు వేధిస్తుందో చెప్తూ నటి అవికా గోర్ షేర్ చేసిన ఎమోషనల్ నోట్ వైరల్ అవుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 July 2026 6:10 AM IST
Avika Gor
X

Avika Gor: ఒంటరితనంపై నటి అవికా గోర్ ఎమోషనల్ పోస్ట్.. ‘ఎదుగుతున్న కొద్దీ నమ్మకమైన వారు దొరకడం కష్టమే’

Avika Gor: చిన్నారి పెళ్లికూతురు (బాలికా వధు) సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, ఆపై టాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటి అవికా గోర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే మానసిక ఒంటరితనంపై ఆమె రాసుకొచ్చిన భావోద్వేగపూరితమైన మాటలు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి.

చుట్టూ జనాలున్నా ఒంటరితనమే!

ఇటీవల ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’, ‘బ్లడీ ఇష్క్’ వంటి చిత్రాలతో అలరించిన అవికా.. నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తనదైన శైలిలో వివరించారు. "ఒంటరిగా గదిలో ఉండటం మాత్రమే ఒంటరితనం కాదు. వంద మంది తెలిసిన వాళ్లు చుట్టూ ఉన్నా.. మనం ఎక్కడ ఇమడాలో, ఎవరితో మనసు విప్పి మాట్లాడాలో తెలియని ఒక శూన్య స్థితి ఉంటుంది. అలాంటి గ్రూపుల్లో చేరడానికి ప్రయత్నించి అలసిపోయాను" అని ఆమె పేర్కొన్నారు.

కెరీర్ కోసం జీవితాన్ని అంకితం చేస్తే..

చిన్న వయసు నుంచే నటనపై దృష్టి పెట్టడం వల్ల వచ్చిన మార్పులను వివరిస్తూ.. "నా జీవితమంతా నా వృత్తికే (కెరీర్) అంకితం చేశాను. వయసు పెరుగుతున్న కొద్దీ సమాజంలో మనుషులు మనల్ని బేషరతుగా వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించడం ఎంత కష్టమో తెలుసుకోలేకపోయాను. మనం ఇతరులకు ఇచ్చేంత ప్రాధాన్యతను, తిరుగు మనకు ఇచ్చే వ్యక్తులను కనుగొనడం చాలా కష్టంగా మారుతోంది. ఎందుకంటే మనం కెరీర్ రేసులో ఉన్నప్పుడు వాళ్లు బంధాలకు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మనం బంధాలకు సిద్ధమైనప్పుడు, వాళ్లకంటూ ఇప్పటికే ఒక స్నేహితుల బృందం ఏర్పడి ఉంటుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

పరిశ్రమలో ఎంతమంది పరిచయమున్నా, ఎక్కడా పూర్తి బంధాన్ని వెతుక్కోలేకపోతున్నానని, అందరూ తెలిసి కూడా ఎక్కడికీ చెందనట్లుగా మిగిలిపోవడం మానసికంగా అలసటను ఇస్తుందని అవికా నిష్కపటంగా అంగీకరించారు. సెలబ్రిటీల గ్లామర్ జీవితం వెనుక ఉండే అసలు సిసలైన భావోద్వేగాలను, కెరీర్ కోసం పడే మానసిక సంఘర్షణను ఆమె పోస్ట్ అద్దం పడుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story