ANR refused NTR movie: ఎన్టీఆర్‌ బతిమిలాడినా ఏఎన్నార్‌ ఆ సినిమాలో నటించలేదు...కారణమేంటో తెలుసా?

తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘దానవీరశూరకర్ణ’ ఒక అద్భుతం. నందమూరి తారక రామారావు నటన, దర్శకత్వ ప్రతిభకు నిలువుటద్దం ఈ సినిమా.

Balachander
Published on: 4 May 2026 1:28 PM IST
ANR refused NTR movie:  ఎన్టీఆర్‌ బతిమిలాడినా ఏఎన్నార్‌ ఆ సినిమాలో నటించలేదు...కారణమేంటో తెలుసా?
X

ANR refused NTR movie: తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘దానవీరశూరకర్ణ’ ఒక అద్భుతం. నందమూరి తారక రామారావు నటన, దర్శకత్వ ప్రతిభకు నిలువుటద్దం ఈ సినిమా. అయితే, ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఒక ఆసక్తికరమైన వెలుగులోకి రాని ఘట్టం ఉంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఎన్టీఆర్ స్వయంగా అక్కినేని నాగేశ్వరరావును సంప్రదించారు. ఎన్టీఆర్‌తో పాటు అప్పటి ముఖ్యమంత్రి ద్వారా కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ, ఏఎన్నార్ మాత్రం దానవీరశూరకర్ణలో పాత్రను సున్నితంగా తిరస్కరించారు. దానికి గల కారణాలు వింటే అక్కినేని దూరదృష్టికి ఆశ్చర్యం కలగక మానదు.

ఎన్టీఆర్ ప్రతిపాదన.. ఏఎన్నార్ సున్నిత నిరాకరణ

ఎన్టీఆర్‌ దానవీరశూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో నటించి మెప్పించాడు. శ్రీకృష్ణుడు, కర్ణుడు, సుయోధనుడు..మూడు పాత్రలు దేనికదే తలమానికం. అయితే, మొదట ఎన్టీఆర్‌ ఈ మూడు పాత్రల్లో నటించాలని అనుకోలేదు. తన అనుంగమిత్రుడు, సహచరనటుడు ఏఎన్నార్‌తో ఒక వేషం వేయించాలని అనుకున్నాడు. శ్రీకృష్ణుడు లేదా కర్ణుడి పాత్రలో ఒకదానిని ఏఎన్నార్‌ పోషిస్తే బాగుంటుందని అనుకున్నారు. అంతకుముందు ఈ ఇద్దరి నటుల మధ్య చిన్నపాటి గొడవలు ఉండేవి. సినిమా ప్రారంభానికి ముందు అవన్నీ సర్దుకుపోయాయి. తన సినిమాలో ఏఎన్నార్‌కి వేషం ఇస్తే స్నేహం మరింత బలపడుతుందని అనుకున్నారు. పాత్రకు సంబంధించిన విషయాన్ని ఎన్టీఆర్‌ నాగేశ్వరరావు ముందుకు తీసుకెళ్లగా ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. అంతేకాకుండా, శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్‌ చూసిన జనం తనని చూడలేరని, కర్ణుడి పాత్రలో నటిస్తే తన పక్కన పాండవులు మరగుజ్జుల్లా ఉంటారని చమత్కరించి తిరస్కరించారు. అయితే, ఏఎన్నార్‌ తిరస్కరించడం వెనుక మరో కారణం కూడా ఉంది. గతంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కలిసి నటించిన శ్రీకృష్ణార్జున యుద్ధం ప్రివ్యూ చూసిన ఏఎన్నార్‌ భార్య అన్నపూర్ణమ్మ ...రామారావు పక్కన పౌరాణిక పాత్రలు చేయవద్దని, ఎన్టీఆర్‌ ముందు తేలిపోయారని అన్నారు. ఆ మాటను మనసులో ఉంచుకొని ఏఎన్నార్‌ ఈ పాత్రను తిరస్కరించారు.

షూటింగ్ విశేషాలు

ఇక దానవీరశూరకర్ణ సినిమాను కేవలం 43 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తిచేశారు. భారీ తారాగణం, పౌరాణిక ఘట్టాలు, ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం... చేస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 43 రోజుల్లో పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజుల్లో సంవత్సరాల తరబడి చిత్రీకరణ చేపడుతున్నారు. ఇక ఈ సినిమా నిర్మాణానికి ఆరోజుల్లో అయిన ఖర్చు 25 లక్షలు. మూడు విభిన్నమైన పాత్రల్లో మూడు రకాలైన ఆహార్యంతో నటించడం అంటే ఎంత డెడికేషన్‌ ఉండాలో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోతో పాటు సైనిక్‌పురి సమీపంలోని చెరువు వద్ద యుద్ధ సన్నివేశాలకు సంబంధించి చిత్రీకరణ జరిపారు. కొన్ని సీన్లు అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరించారు.

బాక్సాఫీస్ వద్ద చారిత్రక విజయం

కేవలం 43 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్‌ దానవీరశూరకర్ణ 1977లో సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. అదే సమయంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ కురుక్షేత్రం కూడా రిలీజ్‌ అంది. కురుక్షేత్రం సినిమాస్కోప్‌తో వచ్చిన అయినా. అయితే, ఎన్టీఆర్‌ నటన, భారీ డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాసింది. ఇప్పటికీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఓ క్లాసిక్‌గా మిగిలిపోయింది. ఇక్కడ మనం చెప్పుకోవలసింది ఏమంటే... ఒక గొప్ప నటుడు తన పరిమితులను గుర్తించి మరో నటుడి గొప్పతనాన్ని గౌరవించడం. దానవీరశూరకర్ణ విషయంలో ఇదే జరిగింది. ఎన్టీఆర్‌ ఆఫర్‌ ఇచ్చారని ఏఎన్నార్‌ నటించి ఉంటే సినిమా మరోలా ఉండేది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story