Sankarabharanam: అల్లు రామలింగయ్య లేకుంటే శంకరాభరణం బోసిపోయేదేమో

శంకరాభరణం సినిమాలో సోమయాజులు పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో మాధవాచార్యులుగా నటించిన అల్లు రామలింగయ్య పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత కల్పించారు దర్శకుడు కె విశ్వనాథ్.

Balachander
Published on: 31 July 2026 1:59 PM IST
Sankarabharanam: అల్లు రామలింగయ్య లేకుంటే శంకరాభరణం బోసిపోయేదేమో
X

Sankarabharanam: తెలుగు చలనచిత్ర చరిత్రలో 1980వ సంవత్సరంలో వచ్చిన 'శంకరాభరణం' ఒక సంచలనం. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ కళాఖండం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా జేవీ సోమయాజులు లేదా మంజుభార్గవి గుర్తొస్తారు. కానీ, నిజమైన సినిమా ప్రేమికుడికి, ఒక విశ్లేషకుడికి మాత్రం ఈ సినిమాలో అందరికంటే ముందుగా స్ఫురించేది హాస్య నటుడు అల్లు రామలింగయ్య చేసిన 'మాధవాచార్యులు' పాత్రే. ఆ పాత్రలో ఆయన ప్రదర్శించిన నటన లేకపోతే శంకరాభరణం చిత్రం నిండుతనం కోల్పోయేదేమోననడంలో ఎలాంటి సందేహం లేదు.

శంకరశాస్త్రికి 'ఆరోహణ'... మాధవాచార్యులు 'తాళం'!

సంగీతంలో రాగానికి ఎంత ప్రాధాన్యం ఉందో, దానికి శృతి, తాళం కూడా అంతే ముఖ్యం. ఈ సినిమాలో శంకరశాస్త్రి పాత్ర ఆరోహణ, అవరోహణల వంటిదైతే, మాధవాచార్యుల పాత్ర ఒక లయబద్ధమైన తాళం లాంటిది. శంకరశాస్త్రి పాత్ర కోసం మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, కృష్ణంరాజు వంటి అగ్ర నటుల పేర్లను పరిశీలించారు. అంటే అదొక హీరో స్థాయి పాత్ర అని అర్థమవుతోంది. కానీ మాధవాచార్యుల పాత్ర విషయానికి వస్తే, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఈ పాత్రను అల్లు రామలింగయ్య మాత్రమే చేయాలి అని పట్టుబట్టారు. ఆ పాత్ర ప్రాధాన్యాన్ని ఆయన ముందే గుర్తించారు.

నిస్సహాయతను నిలదీసే ధైర్యం... సన్నివేశంలో జీవం

సినిమాలో ఒక ఘట్టంలో, గండపెండేరం తొడిగించుకున్న శంకరశాస్త్రిని చూసి, ఇంకా నీకెందుకురా ఈ కంచి గరుడ సేవ? అని మాధవాచార్యులు నిలదీస్తారు. ఆ మాటలు విన్న శంకరశాస్త్రి ఎదురు చెప్పలేక, తన నిస్సహాయతను ప్రకటిస్తూ చేతిపైనే కర్పూర హారతి వెలిగించుకుంటారు. పండితుడైన శంకరశాస్త్రినే అంతగా ప్రశ్నించగలిగే స్థాయి, అంతటి వ్యక్తిత్వం ఉన్న పాత్ర కేవలం మాధవాచార్యులదే. శంకరశాస్త్రి కంటే పెద్ద స్టేచర్ ఉన్న వ్యక్తిగా అల్లు రామలింగయ్య గారు ఆ సన్నివేశంలో అద్భుతమైన గాంభీర్యాన్ని ఒలకబోశారు. ఇలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. శంకరశాస్త్రిని ప్రశ్నించే ధైర్యం ఒక్క మాధవాచార్యులు పాత్రకు మాత్రమే ఉన్నది. ఆ పాత్రలో అల్లు రామలింగయ్య ఒదిగిపోయి నటించారని చెప్పొచ్చు.

శంకరుడికి ఆభరణం... ఈనాటికీ ఆకట్టుకునే నటన

సుమారు 46 ఏళ్ల కిందట విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా, శంకరుడిలా కనిపించే సోమయాజులు పక్కన, ఆభరణం లాంటి అల్లు రామలింగయ్య లేకపోతే ఈ సినిమా ఎంత బోసిగా ఉండేదో అర్థమవుతుంది. అందుకే ఈ సినిమాను ఎంతమంది ఎన్ని రకాలుగా చూసినా... నిజమైన సినిమా విశ్లేషకులకు మాత్రం ఇందులో అల్లు రామలింగయ్య అసలైన కథానాయకుడిగా కనిపిస్తారు. ఒక పాత్రకు బలాన్ని, ఆ పాత్రలోని ఔన్నిత్యాన్ని చాటిచెప్పేందుకు సహకరించే పాత్రలే నిజమైన కథానాయకుడిగా భావించాలి. ఆ పాత్రలే సినిమాలను నిలబెడతాయి. మరుపురాని చిత్రాలుగా మారుస్తాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story