Rukmini Vasanth: మా రుక్మిణి పాప ఫొటోలను డీప్‌ఫేక్ చేస్తారా.. చివరకు ఏమైందంటే..?
Rukmini Vasanth: కన్నడ నటి రుక్మిణి వసంత్ ఏఐ డీప్‌ఫేక్ ఫోటోల వివాదంలో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Rukmini Vasanth: మా రుక్మిణి పాప ఫొటోలను డీప్‌ఫేక్ చేస్తారా.. చివరకు ఏమైందంటే..?
Rukmini Vasanth: 'సప్త సాగరదాచే ఎల్లో' చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా, తన సహజసిద్ధమైన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది నటి రుక్మిణి వసంత్. ఇండస్ట్రీలో పద్ధతైన, హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ దారుణమైన సైబర్ నేరానికి బాధితురాలిగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ కొందరు కేటుగాళ్లు సృష్టించిన నకిలీ చిత్రాలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. అయితే, టెక్నాలజీ వెనుక దాక్కున్న ఆ నకిలీ రాయుళ్లపై ఆమె గట్టిగా పోరాడి, కటకటాల వెనక్కి నెట్టింది.
ఇటీవల సోషల్ మీడియా వేదికగా రుక్మిణి వసంత్ స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీ ధరించి ఫోటోషూట్ చేసినట్లు కొన్ని చిత్రాలు, విజువల్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. భారీ ప్రొడక్షన్ సెటప్, టెక్నీషియన్ల మధ్య ఈ షూట్ జరిగినట్లు కనిపించడంతో.. ఇన్నాళ్లూ హోమ్లీగా కనిపించిన రుక్మిణి ఇలాంటి బోల్డ్ గ్లామర్ బాట పట్టిందేంటని నెటిజన్లు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ, అసలు నిజం తెలిశాక అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అవన్నీ ఒరిజినల్ ఫోటోలు కావు.. ఏఐ టెక్నాలజీతో సృష్టించిన నకిలీ ఫొటోలని. తనపై జరుగుతున్న ఈ దుష్ప్రచారంపై రుక్మిణి వసంత్ అత్యంత తీవ్రంగా స్పందించింది. సైబర్ నేరగాళ్లకు గట్టి వార్నింగ్ ఇస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది.
ఇలాంటి అశ్లీల కంటెంట్‌ను సృష్టించడం, షేర్ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య. ఇది నా వ్యక్తిగత గోప్యతను తీవ్రంగా ఉల్లంఘించడమే. ఈ మార్ఫింగ్ ఫోటోల వల్ల నా కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. దీన్ని నేను అస్సలు వదిలిపెట్టను, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాను అని రుక్మిణి వసంత్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆ ఫోటోలను ఎవరూ షేర్ చేయవద్దని, వైరల్ చేయవద్దని నెటిజన్లను ఆమె కోరింది. కేవలం సోషల్ మీడియా పోస్టులతో ఆగిపోకుండా.. వెంటనే బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది.
సెలబ్రిటీల డీప్‌ఫేక్ కేసులను సీరియస్‌గా తీసుకుంటున్న పోలీసులు.. రుక్మిణి ఫిర్యాదు చేయడమే ఆలస్యం, రంగంలోకి దిగారు. టెక్నాలజీ ఆధారంగా నిందితుల ఐపీ అడ్రస్‌లను ట్రేస్ చేస్తూ చకచకా స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులను బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు సక్సెస్‌ఫుల్‌గా అదుపులోకి తీసుకున్నారు. రవి కుమార్ , చంద్రకాంత్ , రంజిత్, అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలో ఏఐ టూల్స్ ద్వారా ఫోటోలను ఎలా మార్ఫ్ చేశారు? ఎక్కడెక్కడ షేర్ చేశారు? అనే పక్కా ఆధారాలను లాగారు. ప్రస్తుతం కోర్టు వీరికి రిమాండ్ విధించింది. నిందితులు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.
గతంలో రష్మిక మందన్న, ఆలియా భట్, కట్రీనా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ డీప్‌ఫేక్ మాయాజాలానికి బాధితులుగా మారారు. టెక్నాలజీ పెరగడం మానవాళికి ఎంత ఉపయోగపడుతుందో.. ఇలాంటి వికృత బుద్ధి ఉన్న సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడితే అంత ప్రమాదకరంగా మారుతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఏది ఏమైనా.. సైబర్ వేధింపులకు భయపడి వెనకడుగు వేయకుండా, తక్షణమే పోలీసులను ఆశ్రయించి నిందితులను పట్టుకునేలా చేసిన రుక్మిణి వసంత్ ధైర్యాన్ని నెటిజన్లు, సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. చట్టం ప్రకారం ఇలాంటి డీప్‌ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసినా, లేదా వాటిని సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేసినా కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.




