Toxic Movie: 'టాక్సిక్' ఇంగ్లీష్ వెర్షన్ డిజాస్టర్.. దేశమంతా కలిపి వచ్చింది కేవలం రూ. లక్షే!

Toxic Movie: యశ్ నటించిన 'టాక్సిక్' ఇంగ్లీష్ వెర్షన్‌కు ఊహించని షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా కేవలం 450 టికెట్లు అమ్ముడయ్యాయి.

Ravi
By Ravi
Published on: 5 Sept 2026 4:17 PM IST
Toxic Movie
X

Toxic Movie: 'టాక్సిక్' ఇంగ్లీష్ వెర్షన్ డిజాస్టర్.. దేశమంతా కలిపి వచ్చింది కేవలం రూ. లక్షే!

Toxic Movie: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిణామాలను ఎదుర్కొంటోంది. 'కేజీఎఫ్' లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత యశ్ నటించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నయనతార, కియారా అద్వానీ లాంటి స్టార్ నటులను ఈ ప్రాజెక్టులో భాగం చేశారు.

ఈ సినిమాను మేకర్స్ సుమారు రూ. 500 కోట్లు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గత నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి కొంత మేర నెగెటివ్ టాక్ వచ్చింది. తొలి వీకెండ్‌లో వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఆ తర్వాత క్రమంగా డ్రాప్ అవుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్‌ను కూడా థియేటర్లలోకి తీసుకురాగా.. దానికి ప్రేక్షకుల నుంచి ఏమాత్రం స్పందన రాలేదు.

నిన్న ఇండియాలో పరిమిత స్క్రీన్లలో విడుదలైన 'టాక్సిక్' ఇంగ్లీష్ వెర్షన్‌కి బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవం ఎదురైంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు కేవలం 450 టికెట్లు మాత్రమే అమ్ముడుపోవడం సినీ వర్గాలను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఇంగ్లీష్ వెర్షన్ ద్వారా మొదటి రోజు కేవలం రూ. 1.40 లక్షలు కలెక్షన్లు మాత్రమే వచ్చాయని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

ముంబై, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఓ మోస్తరు ఆక్యుపెన్సీ కనిపించినా, గురుగ్రామ్, నోయిడా లాంటి ప్రాంతాల్లో అయితే కనీసం 25 టికెట్లు కూడా అమ్ముడుపోలేదని స్పష్టమవుతోంది. కేవలం 11 షోలతో ప్రదర్శితమైన ఈ వెర్షన్ దారుణంగా విఫలం కావడంతో రెండో రోజు నుంచి షోల సంఖ్యను మరింత తగ్గించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంగ్లీష్ వెర్షన్ లైఫ్‌టైమ్ కలెక్షన్లు కనీసం రూ. 10 లక్షలు మార్కును కూడా దాటడం చాలా కష్టమేనని బాక్సాఫీస్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం నిన్నటివరకు సుమారు రూ. 330 కోట్లు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ తెలిపారు. అందులో హిందీ వెర్షన్ వసూళ్లు రూ. 130 కోట్లు వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే సినిమా బడ్జెట్ రూ. 500 కోట్లు దాటిపోవడంతో, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి రావాలంటే ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒకవైపు నెగెటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, మరోవైపు కొత్తగా విడుదలైన సినిమాల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీ ఈ చిత్రానికి పెద్ద అవరోధంగా మారాయి.

రోజువారీ వసూళ్లు భారీగా పడిపోవడంతో సినిమా పెట్టుబడిని తిరిగి రాబట్టడం మేకర్స్‌కు ఒక పెద్ద సవాలుగా మారింది. భారీ అంచనాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయిందనే కామెంట్స్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ వెర్షన్ ఇంత దారుణమైన వసూళ్లు రాబట్టడం యశ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story