Actor Mada: పాత్రపేరునే ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు...ఆ ఒక్కనాటకంతోనే లైఫ్‌ సెటిల్‌

సినిమాల్లో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి అద్భుతం ఆయా నటుల జీవితాల్లో ఎన్నటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. కొంతమంది నటుల జీవితాన్నే మార్చేస్తుంది.

Balachander
Published on: 25 May 2026 3:44 PM IST
Actor Mada: పాత్రపేరునే ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు...ఆ ఒక్కనాటకంతోనే లైఫ్‌ సెటిల్‌
X

Actor Mada: సినిమాల్లో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి అద్భుతం ఆయా నటుల జీవితాల్లో ఎన్నటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. కొంతమంది నటుల జీవితాన్నే మార్చేస్తుంది. పోషించిన పాత్రల పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న నటులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి పాత్రతో జీవితాంతం నటించిన ఓ వ్యక్తి కథే ఇది. పాత్ర పేరుతోనే దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయనే మాడా వెంకటేశ్వరరావు. ఆయన నటించిన విభిన్నమైన పాత్ర ఆయన జీవితాన్ని మలుపుతిప్పడమే కాకుండా పదేళ్లపాటు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. నాటకరంగం నుంచి మొదలైన ఆయన ప్రస్థానం వెండితెరపై చెరగని ముద్ర వేసింది. ఆయన జీవితంలోని ఆసక్తికరమైన కోణాలు విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం.

నాటకరంగం నుండి 'మాడా' పుట్టుక

తూర్పుగోదావరి జిల్లా కడియం సమీపంలోని దుళ్ళ గ్రామంలో 1950లో జన్మించిన వెంకటేశ్వరరావు చిన్నతనం నుంచే నాటకాలంటే ప్రాణం. వృత్తిరీత్యా ఆయన విద్యుత్ శాఖలో ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఉద్యోగం చేస్తూనే కాకినాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఈ క్రమంలో ఆయన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ అనే ప్రసిద్ధ నాటకంలో "పువ్వుల పున్నయ్య" అనే హిజ్రా పాత్ర వేశాడు. ఆ పాత్ర ఆరోజుల్లో ఆంధ్రదేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ఆ పాత్రలో ఆయన చూపించిన హావభావాలు, నటన ఎంతగా పాపులర్ అయ్యాయంటే, ప్రేక్షకులు ఆయన అసలు పేరు మరిచిపోయి "మాడా" అని పిలవడం ప్రారంభించారు. ఆ నాటకంలోని "సూడు పిన్నమ్మ పాడు పిల్లాడు.." అనే పాట, ఆ పాత్రే ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి.

వెండితెర ప్రవేశం... అక్కినేని, ఎన్టీఆర్ ప్రోత్సాహం

హైదరాబాద్‌లో ఓ నాటక ప్రదర్శనలో మాడా నటనను చూసి ముగ్ధులైన నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆయనకు సినిమాలో అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏఎన్నార్‌, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కలిసి సుడిగుండాలు సినిమా తీశారు. ఈ సినిమాతోనే మాడా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత జై జవాన్‌, అమాయకురాలు, కె విశ్వనాథ్‌ సినిమా ఉండమ్మా బొట్టు పెడతా వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. 1972లో తెలుగు చిత్రపరిశ్రమ మద్రాసుకు మారినపుడు మాడా అక్కడికే వెళ్లారు. అక్కడే ఎన్టీఆర్‌ ఆయనను ప్రోత్సహించి కులగౌరవం, డ్రైవర్‌ రాముడు, శ్రీమద్విరాట్ పర్వం వంటి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు.

ముత్యాలముగ్గు ఓ మైలురాయి

మాడా కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం బాపు దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాలముగ్గు’. ఈ చిత్రంలో ఆయన చెప్పిన “హలో హలో హలో…” అనే డైలాగ్ ఇప్పటికీ ఎంతో ఫేమస్. కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోల సినిమాల్లో దాదాపు 30 సంవత్సరాల పాటు వందలాది చిత్రాలలో నటించి మెప్పించారు. 1995లో సినిమా పరిశ్రమ పూర్తిగా హైదరాబాద్‌కు మారడంతో పాటు కొత్తతరం హాస్యనటుల రాకతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినా...ఆయన తనను నిలబెట్టిన నాటకరంగంపై మక్కువతో ఆ రంగంలో కొంతకాలం నటుడిగా నెగ్గుకొచ్చారు. కాగా, 2015లో తన 65వ ఏట అనారోగ్య సమస్యల కారణంగా మాడా కన్నుమూశారు.

మాడా గురించి క్లుప్తంగా చెప్పాలంటే... ఒక ప్రభుత్వ ఉద్యోగి సమాజంలో ఎవరూ చేయలేని ఓ విభిన్నమైన పాత్రను ధైర్యంగా ఎంచుకొని దానినే తన ఇంటిపేరుగా మార్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన జీవితం నేటి తరం నటులకు ఓ గొప్ప పాఠం. పాత్ర చిన్నదా పెద్దదా అని కాకుండా... చేసే పాత్రల్లో ఎంత జీవం ఉందనేదే నటుడికి శాశ్వతమైన కీర్తిని ఇస్తుంది. దీనికి ఓ ఉదాహరణ మాడానే.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story