Karuppu Subbiah: పాత్రల్లో జీవించవచ్చు...కానీ పాత్రలతో మరణించిన నటులున్నారని మీకు తెలుసా?
పాత్ర కోసం శరీరానికి వేసిన రంగే తమిళ నటుడు కరుప్పు సుబ్బయ్య జీవితాన్ని విషాదాంతానికి నెట్టిందని చెబుతున్నారు.
Karuppu Subbiah: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. కానీ, ఈ ప్రపంచం బయటకు కనపించేంత అందంగా లోపల ఉండదన్నది వాస్తవం. తెరపై నవ్వులు పూయించే నటుల వెనుక ఎన్నో కన్నీటి కథలు ఉంటాయి. పాత్రల్లో జీవించి జీవితాన్ని అందంగా మలుచుకోవాలనుకున్న సమయంలో... కొన్ని పాత్రల కోసం ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుంది. అటువంటి పాత్రల్లో నటించకుంటే అవకాశాలు రావు. ఇలా ఓ నటుడు తాను పోషించిన పాత్ర కోసం వేసుకున్న రంగు ప్రాణాంతకరంగా మారి, చివరకు అతని మరణానికి కారణమౌందంటే నమ్ముతారా? కానీ, ఇది నిజం. తన పాత్రలో విలన్‌గా మారిన రంగును వేసుకున్న నటుడి పేరు కరుప్పు సుబ్బయ్య. కానీ ఇతని అసలుపేరు వెళ్లై సుబ్బయ్య. కానీ సీనీ రంగంలోకి వచ్చిన తరువాత అతడ్ని కరుప్పు సుబ్బయ్యగా పిలవడం ప్రారంబించారు. ఓ సీన్ కోసం ఒంటికి వేసుకున్న రంగులోని కెమికల్ శరీరంలోకి ఇంకిపోయి పదేళ్లపాటు నరకం చూశాడు. ఆ రంగు మహమ్మారి కారణంగా చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
మధురై నుంచి చెన్నైకి
తమిళనాడులోని మధురైకి చెందిన సుబ్బయ్య సినిమాలపై మక్కువతో 1960లో చెన్నైకి చేరుకున్నాడు. అక్కడే 1961లో కుముదం 1962లో వచ్చిన ఇందిరా ఎన్ సెల్వం చిత్రాల్లో నటించాడు. శరీరఛాయ నల్లగా ఉండటంతో ఆయన్ను కరుప్పు సుబ్బయ్యగా పిలిచేవారు. 1980-90లో ఆయన వందలాది చిత్రాల్లో హాస్యనటుడిగా నటించి మెప్పించాడు. ‘కట్టబొమ్మన్’, ‘పెరియ మరుదు’ వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ముఖ్యంగా అగ్ర హాస్యనటుడు గౌండమణితో కలిసి ఆయన చేసిన కామెడీ సీన్లు, అందులో గౌండమణిని ‘ఆఫ్రికా అంకుల్’ అని పిలిచే డైలాగ్ అప్పట్లో ప్రేక్షక లోకాన్ని విపరీతంగా నవ్వించింది.
‘పెరియ మరుదు’ సినిమా... జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క సీన్
కరుప్పు సుబ్బయ్య జీవితాన్ని ‘పెరియ మరుదు’ అనే సినిమా పూర్తిగా మార్చేసింది. ఆ చిత్రంలోని ఒక కామెడీ సన్నివేశం కోసం ఆయన శరీరానికి పూర్తిగా ఒక రకమైన రంగును పూయాల్సి వచ్చింది. దర్శకుడి అభ్యర్థన మేరకు సుబ్బయ్య అందుకు అంగీకరించారు. అయితే ఆ రోజుల్లో వాడిన రంగుల్లో రసాయనాలు ఎక్కువగా ఉండేవి. పాత్రకోసం రంగును వేసుకున్న సుబ్బయ్యకు అదే ప్రాణాంతకరంగా మారుతుందని అనుకోలేదు. షాట్ తీసిన తరువాత శరీరానికి వేసుకున్న రంగు సరిగా వదల్లేదు. అందులోకి కెమికల్స్ శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన చర్మవ్యాధులు సంభవించాయి. క్రమంగా ఆయన అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ సమయంలో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో సుబ్బయ్య తన సొంతూరికి వెళ్లిపోయాడు. సొంతూరిలోనే రంగు తాలూకు నరకం అనుభవించాడు. 2013లో తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశాడు. నవ్వించే నటుడి జీవితం ఇలా రంగుల విష ప్రభావంతో ముగియడం సినీ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది.




