Producer Sunil Narang: ప్రముఖ టాలీవుడ్ నిర్మాతకు కోటి రూపాయల టోకరా
Producer Sunil Narang: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కార్యాలయంలో భారీ ఆర్థిక మోసం కలకలం రేపింది.
Producer Sunil Narang
Producer Sunil Narang: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కార్యాలయంలో భారీ ఆర్థిక మోసం కలకలం రేపింది. నమ్మకంగా పనిచేస్తున్న అకౌంటెంటే యజమాని కళ్లు గప్పి కోటి రూపాయలకు పైగా సొమ్మును పక్కదారి పట్టించాడు. ఈ కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
మూడేళ్లుగా సాగుతున్న మాయాజాలం:జూబ్లీహిల్స్‌లో ఉన్న సునీల్ నారంగ్ ప్రధాన కార్యాలయంలో వనస్థలిపురానికి చెందిన విశ్వనాథ్ గత కొంతకాలంగా అకౌంటెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పంపిణీదారుల చెక్కుల జారీ, వారాంతపు లెక్కలన్నీ అతడి పర్యవేక్షణలోనే జరిగేవి. యజమాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న విశ్వనాథ్, తన సొంత ప్రయోజనం కోసం ఒక పథకం రచించాడు. ఎవరికీ అనుమానం రాకుండా కొన్ని నకిలీ బ్యాంకు ఖాతాలను తెరిచి, సంస్థ సొమ్మును వాటిలోకి మళ్లించడం మొదలుపెట్టాడు.
సంతకాల విషయంలో చాకచక్యం
నిందితుడు విశ్వనాథ్ మోసం చేసే విధానం చూసి పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. పంపిణీదారులకు ఇవ్వాల్సిన అసలైన చెక్కుల మధ్యలో, తాను సృష్టించిన బోగస్ ఖాతాల చెక్కులను కూడా ఉంచేవాడు. యజమాని సునీల్ నారంగ్ బిజీగా ఉన్న సమయంలో, ఆ చెక్కులపై చాకచక్యంగా సంతకాలు చేయించుకునేవాడు. ఇలా గడిచిన మూడేళ్ల కాలంలో సుమారు కోటి రూపాయల వరకు తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడని విచారణలో తేలింది. సంస్థలో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి కూడా ఇతడిపై ఎలాంటి అనుమానం కలగకుండా జాగ్రత్త పడ్డాడు.
ఆడిటింగ్‌లో బయటపడ్డ బాగోతం
ఎంతటి నేరగాడైనా ఏదో ఒక రోజు దొరకక తప్పదన్నట్లు, 2024 వార్షిక లెక్కల తనిఖీ (ఆడిటింగ్) సమయంలో విశ్వనాథ్ మోసం వెలుగులోకి వచ్చింది. పంపిణీదారులకు వెళ్లాల్సిన సొమ్ములో భారీ తేడాలు కనిపించడంతో ఆడిటర్లు యాజమాన్యాన్ని అప్రమత్తం చేశారు. లోతుగా విచారించగా అకౌంటెంట్ చేసిన అక్రమాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. దీంతో వెంటనే సునీల్ నారంగ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రిమాండ్‌కు తరలింపు
ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే పరారైన విశ్వనాథ్‌ను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.




