72nd National Film Awards : అవార్డుల్లో టాలీవుడ్ హవా.. అవార్డుల పంట పండించిన తెలుగు సినిమాలివే.!

72nd National Film Awards : 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినీ పరిశ్రమ అద్భుతమైన ప్రతిభ కనబరిచి రికార్డు స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది.

G Krishna
Published on: 18 July 2026 7:05 PM IST
National-Award-winners
X

National-Award-winners

72nd National Film Awards : 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినీ పరిశ్రమ అద్భుతమైన ప్రతిభ కనబరిచి రికార్డు స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ నుండి మనసుకు హత్తుకునే చిన్న సినిమాల వరకు వివిధ విభాగాల్లో తెలుగు చిత్రాలు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నాయి. సాంకేతిక విభాగాలతో పాటు కథ, కథనం, నటనలోనూ తెలుగు ప్రతిభ దేశవ్యాప్తంగా మారుమోగింది. అవార్డుల రేసులో నిలిచిన మన తెలుగు సినిమాల పూర్తి వివరాలు ఇవే..

‘కల్కి 2898 AD’, ‘pushpa 2’ చిత్రాలకు భారీ పురస్కారాలు

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ సినిమాకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్’ కేటగిరీలో ఈ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది. అలాగే, ఈ చిత్రానికి అద్భుతమైన సెట్టింగ్స్ ప్రాణం పోసిన నితిన్ జిహాని చౌదరి 'బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్' అవార్డును సొంతం చేసుకున్నారు.

మరోవైపు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సైతం జాతీయ అవార్డుల రేసులో దూసుకుపోయింది. ఈ చిత్రానికి గాను దర్శకుడు సుకుమార్ 'బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్' (కథనం) అవార్డును గెలుచుకోగా.. సినిమాలో నటీనటుల లుక్స్ కోసం అద్భుతంగా డిజైన్ చేసిన దీపాలి నూర్, శీతల్ శర్మ సంయుక్తంగా 'బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్' అవార్డును దక్కించుకున్నారు.

‘35 చిన్న కథ కాదు’ చిత్రానికి డబుల్ ధమాకా

నివేదా థామస్ ప్రధాన పాత్రలో చిన్న సినిమాగా వచ్చి థియేటర్లలో పెద్ద విజయం సాధించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్రం జాతీయ జూరీని సైతం కట్టిపడేసింది. ఈ సినిమా ఏకంగా 'బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం' (ఉత్తమ బాలల చిత్రం) గా జాతీయ అవార్డును గెలుచుకుంది. దీనికి తోడు, ఈ సినిమాలో తన సహజ నటనతో మెప్పించిన బాల నటుడు అరుణ్ దేవ్ 'బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్' (ఉత్తమ బాల నటుడు) అవార్డును కైవసం చేసుకుని తెలుగు వారి ఖ్యాతిని పెంచాడు.

స్క్రీన్‌ప్లే, మేకప్‌లోనూ మనవాళ్లే టాప్

యువ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ సినిమాకు సైతం జాతీయ పురస్కారం దక్కింది. ఈ చిత్రానికి ప్రాణం పోసేలా అద్భుతమైన మాటలు రాసినందుకు గాను 'బెస్ట్ స్క్రీన్‌ప్లే (డైలాగ్స్)' కేటగిరీలో దర్శకుడు వెంకీ అట్లూరి నేషనల్ అవార్డును గెలుచుకున్నారు.

ఇక బెస్ట్ రీజినల్ ఫిలింగా నిలిచిన ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా టెక్నికల్ విభాగంలోనూ మెరిసింది. ఈ చిత్రంలో నటీనటులను సహజసిద్ధంగా చూపించడంలో కీలక పాత్ర పోషించిన పి. రవికుమార్ 'బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్' అవార్డును దక్కించుకున్నారు. మొత్తంగా కమర్షియల్, టెక్నికల్ , కంటెంట్ పరంగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా ప్రదర్శించిన ఈ హవాపై టాలీవుడ్ ప్రముఖులు , ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story