Narsapur: హత్నూర గురుకులంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం..కలెక్టర్‌కు తల్లిదండ్రుల వినతి!

Narsapur: హత్నూర ప్రభుత్వ గురుకులంలో విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం. ప్రిన్సిపాల్‌ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 15 Sept 2026 3:43 PM IST
Narsapur
X

Narsapur: హత్నూర గురుకులంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం..కలెక్టర్‌కు తల్లిదండ్రుల వినతి!

Narsapur: సంగారెడ్డి జిల్లా. హత్నూర మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యలకు ముఖ్య కారణం ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరేనని, ప్రిన్సిపాల్‌కు ఉపాధ్యాయుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ వాటిని సక్రమంగా అమలు చేస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంపై ఉంది.

కానీ హత్నూర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థులకు జ్వరం వచ్చినా సకాలంలో వైద్యం అందించడం లేదని, కొంతమంది విద్యార్థుల కాళ్లు, చేతులకు పుండ్లు ఏర్పడినా వైద్యుల వద్దకు తీసుకెళ్లడంలో జాప్యం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హాస్టల్ పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, దోమల బెడదతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.

అంతేకాకుండా విద్యార్థుల పట్ల పర్యవేక్షణలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోందని, ప్రిన్సిపాల్ సరైన విధానంలో విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ప్రిన్సిపాల్‌కు, ఉపాధ్యాయులకు మధ్య సమన్వయం సరిగా లేకపోవడం వల్లే విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు అంటున్నారు.

ఈ సమస్యలపై కొద్దిరోజుల క్రితం

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రగతిశీల విద్యార్థుల పేరెంట్స్ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్యం, హాస్టల్‌లో నెలకొన్న సమస్యలు, సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరినట్లు పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలిపారు.

“ప్రిన్సిపాల్ విద్యార్థుల సమస్యలను సక్రమంగా పట్టించుకోవడం లేదు... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు” అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అంతేకాకుండా ప్రిన్సిపాల్‌ను తక్షణమే ఇక్కడి నుంచి బదిలీ చేస్తే హాస్టల్‌లో పరిస్థితులు కొంతమేరైనా మెరుగుపడి, విద్యార్థులకు మేలు జరుగుతుందని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులకు జ్వరం వచ్చినప్పుడు వెంటనే వైద్య చికిత్స అందించడం, అవసరమైతే ఆసుపత్రికి తరలించడం, వైద్యుల సూచన మేరకు బ్రెడ్, పాలు వంటి పౌష్టికాహారం అందించడం వంటి కనీస బాధ్యతలను సిబ్బంది నిర్వర్తించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఉదయం విద్యార్థులకు ఆటలు ఆడించే పీటీ, పీడీలు కూడా ఆటల అనంతరం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గమనించి, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వెంటనే సంబంధిత సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు.

తల్లిదండ్రుల డిమాండ్ ఏంటంటే...

విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు తక్షణమే స్పందించాలని, హాస్టల్ పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, బాధ్యత వహించాల్సిన వారిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం

విద్యార్థులకు హాస్టల్‌లో సరైన వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, హాస్టల్‌లో మెరుగైన వసతులు కల్పించాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు అధికారులను కోరారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR