Narsapur: కోర్టులో లోక్ అదాలత్ సమీక్ష.. పోలీసులకు జడ్జి కీలక ఆదేశాలు
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జూన్ 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌పై జడ్జి హేమలత పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Narsapur: కోర్టులో లోక్ అదాలత్ సమీక్ష.. పోలీసులకు జడ్జి కీలక ఆదేశాలు
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించి పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఎం. హేమలత మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన నర్సాపూర్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజీ చేయదగిన కేసుల్లో ఇరుపక్షాలు పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులతో చర్చించినట్లు చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో కోర్టు పరిధిలో ఉన్న రాజీ చేయదగిన కేసుల్లో ఇరువర్గాలు సహకారంతో వివాదాలను ముగించుకుని ప్రేమ, అనురాగాలతో జీవించాలని ఆమె సూచించారు. లోక్ అదాలత్ ద్వారా వెలువడే తీర్పు అంతిమ తీర్పుగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు.
అలాగే, ఎక్కువ సంఖ్యలో కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యేలా పోలీస్ శాఖ పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో నర్సాపూర్ ఎస్‌ఐ ఏ. రంజిత్ రెడ్డి, కౌడిపల్లి ఎస్‌ఐ అమరేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎక్సైజ్ ఎస్‌ఐ అరుణ, చిలప్‌చేడు హెడ్ కానిస్టేబుల్ ఎలియాస్ రెడ్డి, న్యాయవాది బి. స్వరూప రాణి, కోర్టు కానిస్టేబుళ్లు, లీగల్ సర్వీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




