Narsapur: 3 ఎకరాల రైతుకు 3,850 ఎకరాల భూమి - రెవెన్యూ రికార్డుల్లో తప్పిదం
Narsapur: నర్సాపూర్ మండలంలో భారీ రెవెన్యూ తప్పిదం. చిన్న రైతు పేరున 3,850 ఎకరాలు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్న బాధితుడు. అధికారుల దృష్టికి సమస్య.
Narsapur: 3 ఎకరాల రైతుకు 3,850 ఎకరాల భూమి - రెవెన్యూ రికార్డుల్లో తప్పిదం
నర్సాపూర్: నర్సాపూర్ మండలం తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన ఓ రైతు భూమి విషయంలో రెవెన్యూ రికార్డుల్లో భారీ తప్పిదం వెలుగుచూసింది. కేవలం 3 ఎకరాల 18 గుంటల భూమి ఉన్న రైతు గాలి లక్ష్మీనారాయణకు ఏకంగా 3,850 ఎకరాల భూమి ఉన్నట్లు 22A నిషేధిత జాబితాలో నమోదు కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
రైతు గాలి లక్ష్మీనారాయణకు వాస్తవంగా 3 ఎకరాల 18 గుంటల భూమి ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఇందులోనూ 5 గుంటల భూమిని కాళేశ్వరం కాలువ కోసం ప్రభుత్వం సేకరించినట్లు పేర్కొన్నారు. అయితే ఇటీవల రూపొందించిన 22A నిషేధిత భూముల జాబితాలో 55/అ సర్వే నంబర్‌లో 3,850 ఎకరాల భూమి ఆయన పేరుపై నమోదైనట్లు చూపిస్తోంది.
గ్రామంలో ఉన్న భూమి కంటే.. రికార్డుల్లోనే ఎక్కువ!
తుజాల్‌పూర్ గ్రామంలో మొత్తం భూమి విస్తీర్ణం సుమారు 1,500 ఎకరాలు మాత్రమే ఉంటే.. 22A జాబితాలో మాత్రం గ్రామానికి సంబంధించి 4,706 ఎకరాల భూమి ఉన్నట్లు నమోదైందని స్థానికులు చెబుతున్నారు. దీంతో భూముల వివరాలు, సర్వే నంబర్లు, హక్కుదారుల వివరాల్లో భారీ గందరగోళం నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘నాకు అంత భూమి ఉంటే ఉద్యోగం ఎందుకు చేస్తా?’
తన పేరుపై 3,850 ఎకరాల భూమి నమోదవడంపై రైతు లక్ష్మీనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఉన్న కొద్దిపాటి భూమి వివరాలు కూడా అధికారుల తప్పిదంతో గందరగోళానికి గురయ్యాయని వాపోయారు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని తెలిపారు.
అధికారుల దృష్టికి సమస్య
ఈ వ్యవహారాన్ని నర్సాపూర్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా.. 22A జాబితాను పరిశీలించి పూర్తి వివరాలను సరిచూస్తామని, తప్పిదం ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపినట్లు సమాచారం.
మూడు ఎకరాల రైతు పేరుపై 3,850 ఎకరాలు ఎలా నమోదయ్యాయి? అసలు ఈ తప్పిదానికి కారణం ఎవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు తుజాల్‌పూర్ గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.




