Narsapur: నర్సాపూర్‌లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్ (NMNF) పథకం కింద ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Narsapur: నర్సాపూర్‌లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు
మెదక్: రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా నర్సాపూర్ మండలంలో కీలక కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫామింగ్ (NMNF) పథకం కింద ఎంపికైన చిన్నచింతకుంట, జక్కపల్లి గ్రామాల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి దీపిక మాట్లాడుతూ, ఈ రెండు గ్రామాల్లో ఎంపికైన 125 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారవంతం పెరగడంతో పాటు సాగు ఖర్చులు తగ్గి, రైతులకు అధిక లాభాలు చేకూరడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని వివరించారు.
TRVK హెడ్ డా. సతీష్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక, తేమ సంరక్షణ చర్యలు, వర్షాధార సాగులో అనుసరించాల్సిన ఆధునిక విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.
డా. రంగనాయకులు మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు మంచి అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సాగు పద్ధతులు, మార్కెటింగ్ సౌకర్యాలపై రైతులకు వివరించి ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి పెంచేలా సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జక్కపల్లి సర్పంచ్ భాస్కర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ట్రైనీ డీటీ సాయికుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు తేజస్విని, రాజశేఖర్ గౌడ్తో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూ, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరమైన వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని అధికారులు పిలుపునిచ్చారు.




