Narsapur: నర్సాపూర్‌లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై న్యాయ సదస్సు
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుల్జారంపేటలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
Narsapur: నర్సాపూర్‌లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై న్యాయ సదస్సు
Narsapur: జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ,మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపూర్ మండలంలోని తుల్జారంపేట గ్రామ డ్వాక్రా సంఘంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లీగల్ సర్వీస్ న్యాయవాది జె.రాజు నాయక్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ సమాజానికి శాపంగా మారిందని, దీని నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు. చదువుకోవాల్సిన వయస్సులో ఉన్న బాలబాలికలను పనుల్లో పెట్టకుండా, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్ల సౌకర్యాలను వినియోగించుకుని వారికి నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.
చిన్నారులను ఉన్నత విద్యాభ్యాసం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరేలా తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు కృషి చేయాలని ఆయన అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో డ్వాక్రా మహిళలు కీలక పాత్ర పోషించాలని, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంపొందించి చిన్నారుల హక్కులను పరిరక్షించాలని కోరారు.
అలాగే ఎవరైనా చట్టవిరుద్ధంగా చిన్నపిల్లలను పనిలో పెట్టుకున్నా లేదా వారితో పని చేయించినా సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సి.హెచ్. స్వరూప రాణి,న్యాయవాది జాట్రోత్.రవి నాయక్, ఇంద్రకాంతి పథకం సీసీ ప్రమీల, లీగల్ సర్వీస్ సిబ్బంది, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.




