Narsapur: వర్షాకాలంపై నర్సాపూర్ మున్సిపల్ ఫోకస్ కమిషనర్ దిశానిర్దేశం!

Narsapur: నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కమిషనర్ చెరుకు సాయికుమార్ సమీక్ష నిర్వహించారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 21 July 2026 9:54 PM IST
Narsapur
X

Narsapur: వర్షాకాలంపై నర్సాపూర్ మున్సిపల్ ఫోకస్ కమిషనర్ దిశానిర్దేశం!

నర్సాపూర్, జూలై 21: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పట్టణంలోని పలు కీలక సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేశారు.

ప్రస్తుత వర్షాకాలంలో కూలిపోయే ప్రమాదం ఉన్న శిథిల భవనాలను వెంటనే గుర్తించి, వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని వార్డు అధికారులను ఆదేశించారు. అవసరమైతే భవనాలను తొలగించడం లేదా మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంచినీటి వృథాను అరికట్టేందుకు ప్రతి కుళాయికి కంట్రోల్ వాల్వ్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే పట్టణంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, సంబంధిత వారికి నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు. బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందులు, అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉంచి పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని శానిటేషన్ విభాగాన్ని ఆదేశించారు.

ప్రజలకు మంచినీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా, మరమ్మతులకు అవసరమైన మోటార్లను వెంటనే గుర్తించి బాగు చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందికి సూచించారు. అలాగే కార్యాలయ అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ మేనేజర్ వైట్ల మధుసూదన్, టౌన్ ప్లానింగ్ అధికారి స్రవంతి, మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story