Narsapur: మాదకద్రవ్యాలపై విద్యార్థులకు ఎక్సైజ్ అధికారుల కీలక సూచనలు!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన సదస్సు జరిగింది.
Narsapur: మాదకద్రవ్యాలపై విద్యార్థులకు మెదక్ ఎక్సైజ్ అధికారుల కీలక సూచనలు
నర్సాపూర్, జూలై 14: యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు మెదక్ జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నర్సాపూర్‌లోని బి.వి.ఆర్.ఐ.టి (BVRIT) కళాశాలలో "డ్రగ్స్ నియంత్రణ అవగాహన సదస్సు" నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై విద్యార్థులకు అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గులాం ముస్తఫా మాట్లాడుతూ. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని, ఒక్కసారి అలవాటు అయితే దాని నుంచి బయటపడటం చాలా కష్టమని తెలిపారు.
డ్రగ్స్ మెదడులోని డోపమైన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి వ్యసనానికి గురిచేస్తాయని, తద్వారా చదువు, ఆరోగ్యం, కుటుంబ బంధాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ దెబ్బతింటాయని విద్యార్థులకు వివరించారు. తప్పుడు స్నేహాలు, సోషల్ మీడియా ప్రభావం, పార్టీల పేరుతో డ్రగ్స్‌కు దూరం కావాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ సుచరిత మాట్లాడుతూ. అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదకద్రవ్యాల విక్రయాలపై సమాచారం తెలిసిన వెంటనే ఎక్సైజ్ లేదా పోలీసు శాఖకు తెలియజేయాలని, డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐ రాఘవేంద్రరావు, ఎస్‌ఐ అజీజ్ ఖాన్, ఎస్‌ఐ అరుణ, డీటీఎఫ్ సీఐ గోపాల్, డీటీఎఫ్ ఎస్‌ఐ బాలయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.
అలాగే బీవీఆర్‌ఐటీ డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్ దూబే మాట్లాడుతూ... విద్యార్థులు తమ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని చదువుపై శ్రద్ధ పెట్టాలని, తోటివారి ఒత్తిళ్లకు లొంగకుండా మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.
"డ్రగ్స్‌కు నో. జీవితానికి యెస్" అనే నినాదంతో ముగిసిన ఈ అవగాహన సదస్సు విద్యార్థుల్లో చైతన్యం నింపింది. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని అధికారులు పేర్కొన్నారు.




