Medak: బెట్టింగ్‌ల కోసం బ్యాంకునే ముంచిన మేనేజర్
Medak: మెదక్ ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు మేనేజర్ యాదం అనిల్ రూ.1.80 కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడు.
Medak: బెట్టింగ్‌ల కోసం బ్యాంకునే ముంచిన మేనేజర్
Medak: మెదక్ జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు మోసం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెట్టింగ్‌ల మోజులో పడి బ్యాంకు మేనేజర్ భార్యతో కలిసి రూ.1.80 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేష్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన యాదం అనిల్ మెదక్‌లోని ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
బెట్టింగ్‌లకు బానిసైన అనిల్ భారీ మొత్తంలో డబ్బులు అవసరమవడంతో అక్రమాలకు తెరలేపాడు.తన భార్య స్రవంతితో పాటు స్నేహితుడు సుబ్రహ్మణ్యం పేర్లపై ఆధార్, పాన్‌కార్డులను ఉపయోగించి బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి భారీ మొత్తంలో గోల్డ్ లోన్లు తీసుకున్నాడు. అలాగే బ్యాంకుకు చెందిన రెండు ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే సమయంలో కొంత కొంత డబ్బును పక్కదారి పట్టిస్తూ మొత్తం రూ.31.35 లక్షలు దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో బ్యాంకులో బంగారం తనిఖీ చేసే శ్రీనివాసచారి కూడా సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో యాదం అనిల్, అతని భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసచారిపై కేసు నమోదు చేశారు.నిందితుడు అనిల్‌కు గతంలో కూడా మోసాల చరిత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వెలైపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో పొలవరం నిర్వాసితులు, గిరిజనులను మోసం చేసి రూ.11.82 లక్షలు దుర్వినియోగం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రధాన నిందితుడు యాదం అనిల్ పరారీలో ఉండగా, అతని భార్య స్రవంతి, శ్రీనివాసచారి, సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు. మీడియా సమావేశంలో ఘటన సీఐ మహేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




