Medak: శివ్వంపేటలో యువకుడి అనుమానాస్పద మృతి గ్రామంలో కలకలం!

Medak: శివ్వంపేట మండలం బిజిలీపూర్‌లో నీరుడి పోచయ్య పొలం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి. రక్తపు మరకల నేపథ్యంలో పాత గొడవల కోణంలో పోలీసుల దర్యాప్తు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 12 Sept 2026 7:03 PM IST
Medak
X

Medak: శివ్వంపేటలో యువకుడి అనుమానాస్పద మృతి గ్రామంలో కలకలం!

Medak: శివ్వంపేట మండలం బిజిలీపూర్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన నీరుడి పోచయ్య (36) శనివారం ఉదయం తన పొలం వద్ద రక్తపు మరకల మధ్య విగతజీవిగా కనిపించడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. శుక్రవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన పోచయ్య.. మరుసటి రోజు మృతదేహంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

రాత్రి అదృశ్యం ఉదయానికే మృతదేహం

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పోచయ్య శుక్రవారం రాత్రి నుంచి కనిపించలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు వెతుకుతుండగా.. శనివారం ఉదయం పొలం వద్ద బోర్లా పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం సమీపంలో రక్తపు మరకలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

పాత డబ్బుల గొడవే కారణమా?

పోచయ్యకు గతంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో బియ్యం విక్రయ డబ్బుల విషయంలో వివాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ పాత గొడవల నేపథ్యంలోనే పోచయ్యను హత్య చేసి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటనలో పాత వివాదాల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే పోచయ్య మృతి హత్యా? ప్రమాదమా? ఇతర కారణమా? అనే విషయం ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉంది. రంగంలోకి దిగిన పోలీసులు.

సమాచారం అందుకున్న శివ్వంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి అసలు కారణం స్పష్టమవుతుందని ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

పోచయ్య మృతితో బిజిలీపూర్‌లో విషాద ఛాయలు అలుముకోగా రక్తపు మరకల నేపథ్యంలో ఘటనపై గ్రామంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు పూర్తి విచారణ అనంతరం ఈ మిస్టరీకి తెరపడే అవకాశం ఉంది.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR