Narsapur: డ్రగ్స్‌కు దూరంగా ఉండండి ఎక్సైజ్ సీఐ ముస్తఫా

Narsapur: గోమారం పాలిటెక్నిక్ కళాశాలలో డ్రగ్స్ అవగాహన సదస్సు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని ఎక్సైజ్ సీఐ ముస్తఫా పిలుపు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 22 July 2026 8:40 PM IST
Narsapur
X

Narsapur: డ్రగ్స్‌కు దూరంగా ఉండండి ఎక్సైజ్ సీఐ ముస్తఫా

నర్సాపూర్: యువతలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంతో పాటు డ్రగ్-ఫ్రీ సమాజ నిర్మాణమే లక్ష్యంగా గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాలపై అవగాహన పెంపొందిస్తూ, వాటి దుష్పరిణామాలపై అధికారులు విస్తృతంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ సతీష్, నర్సాపూర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గులామ్ ముస్తఫా, సబ్ ఇన్‌స్పెక్టర్లు ఖాజా అజీజ్ అహ్మద్, అరుణ, కానిస్టేబుళ్లు రాజశేఖర్, బాబు, ఎక్సైజ్ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గంజాయి, సింథటిక్ డ్రగ్స్, మత్తు మాత్రలు, ఇతర నిషేధిత మాదకద్రవ్యాలు యువత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా వారి విద్య, కెరీర్, కుటుంబ జీవితం, భవిష్యత్తును కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయని తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసైన వ్యక్తి తన జీవిత లక్ష్యాలను కోల్పోయే ప్రమాదం ఉందని, క్షణిక ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.

డ్రగ్స్ కొనుగోలు, విక్రయం, రవాణా, వినియోగం చట్టరీత్యా శిక్షార్హమైన నేరాలని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు తమ కళాశాలలు, హాస్టళ్లు లేదా పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే ఎక్సైజ్ లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని, ప్రతి విద్యార్థి డ్రగ్-ఫ్రీ సమాజ నిర్మాణంలో బాధ్యతాయుతంగా భాగస్వామి కావాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మాదకద్రవ్యాలపై తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story