Sirpur: 22ఏ భూముల వివాదంపై రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
Sirpur: సిర్పూర్ సభలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 22ఏ జాబితా వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అసెంబ్లీలో నిలదీస్తామని హెచ్చరించారు.
Sirpur: 22ఏ భూముల వివాదంపై రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
సిర్పూర్: సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. కాంగ్రెస్ పాలనలో భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు. కాగజ్‌నగర్ నియోజకవర్గంలో ఏకంగా 42,867 ఎకరాల రైతుల భూములు 22ఏ జాబితాలో బందీ. రేవంత్ ఇల్లు నిషేధిత జాబితాలో పడితే రాత్రికి రాత్రే తీసేసుకున్నాడు.. మరి పేదలకు ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఇంకో న్యాయమా ఈ పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలి.
సిర్పూర్ సభలో మాజీ మంత్రి హరిశ్ రావు రైతులను కబ్జాదారులుగా అవమానించిన ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. భూములు లేవని బ్యాంకు మేనేజర్లు గెంటేస్తున్నారు.. పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి.. ఇది ఇందిరమ్మ రాజ్యమా కబ్జాల రాజ్యమా ఒక్క ఎకరా కూడా 22ఏ లో పెట్టలేదని అబద్ధాలు ఆడుతున్న మంత్రి పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా నిషేధించాలి.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, దళితబంధు అన్నీ బంద్. ప్రతి అవ్వకు, తాతకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.66 వేల బాకీ పడింది.. వడ్డీతో సహా వసూలు చేస్తాం. మా కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరూ ఒకటయ్యారు ఇక్కడ ఏ శక్తి ఎదురొచ్చినా తుఫాన్‌లో కొట్టుకుపోవాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల గారడి రైతుల భూములకు విముక్తి కల్పించే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలోనే ఏకంగా 42,867 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి రైతుల నోటికాడ బుక్కను రేవంత్ రెడ్డి లాక్కున్నాడు. కౌటాలలో 6,350 ఎకరాలు, చింతల మానేపల్లిలో అత్యధికంగా 8,878 ఎకరాలు, బెజ్జూరులో 8,325 ఎకరాలు, కాగజ్‌నగర్‌లో 6,690, సిర్పూర్ టీలో 4,406, పెంచికల్ పేట్‌లో 2,950, దహేగాంలో 5,268 ఎకరాలను రాత్రికి రాత్రే బ్లాక్ లిస్టులో పడేశారు.
కేసీఆర్ గిరిజనులకు 6 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చి ఆదుకుంటే, రేవంత్ రెడ్డి ఉన్న భూములను గుంజుకుంటున్నాడు. భూములు 22ఏ లో పడితే రైతుల బతుకులు ఆగమాగం అవుతాయి. ఇందాక ఇక్కడ విజయలక్ష్మి, భీంబాయి, మల్లవ్వ లాంటి రైతులు చెప్తుంటే కన్నీళ్లు వచ్చాయి. పాత అప్పు కట్టి, కొత్త లోన్ కోసం పోతే మీ భూమి గవర్నమెంట్ తీసుకుందంటూ బ్యాంక్ మేనేజర్లు వారిని బయటకు పంపేశారు.
కొత్తగా తీసుకొచ్చిన యాప్ వల్ల భూమి పేరు మీద లేకపోతే రేపు యూరియా, డీఏపీ కూడా దొరకదు రైతుబంధు రాదు రైతు బీమా రాదు. ఆడబిడ్డ పెళ్లి చేద్దామని భూమి అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కుదరదంటున్నాడు. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా తిరిగినా న్యాయం జరగట్లేదు. రైతుల పాలిట ఈ 22ఏ ఒక ఉరితాడులా మారింది. కేసీఆర్ ప్రజలే కేంద్ర బిందువుగా పాలన చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం భూములే కేంద్ర బిందువుగా పాలన చేస్తున్నాడు.
ఎవరి భూములు గుంజుకోవాలి ఎవరిని 22ఏ లో పెట్టాలి, ఎవరిని బెదిరించాలి అనేదే కాంగ్రెస్ విధానం. ఒకప్పుడు ల్యాండ్ గ్రాబర్లు భూములు కబ్జా చేసేవాళ్లు.. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే కబ్జాదారుగా మారి రాష్ట్రవ్యాప్తంగా 14.50 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టింది. సిర్పూర్ రైతులు, ఇక్కడ దరఖాస్తులు ఇచ్చిన 40 వేల మంది రైతులు దొంగలా కబ్జాదారులా హైదరాబాద్‌లో కూర్చుని పేద రైతులను దొంగలు అని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పట్టా భూములను లాక్కుంటోంది. 100 ఏళ్ల కిందటి రికార్డులు తీసి ఆసిఫాబాద్ కలెక్టర్ ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ భూములను 22ఏ లో పెట్టాలని ప్రభుత్వానికి లేఖ రాశాడు. అంటే ఇది అధికారుల తప్పు కాదు, రేవంత్ రెడ్డి చేయిస్తున్న కుట్ర.
మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరా కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని మంత్రి బొంకులేటి. అదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. ఇన్ని లక్షల మంది ఆస్తులను రాత్రికి రాత్రే సున్నా వాల్యూ చేసి, అడ్డగోలుగా మాట్లాడిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా నిషేధిత జాబితాలో పెట్టాలి. హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22ఏ లో పడింది.
నేను ఆ విషయం బయటపెట్టగానే ముఖ్యమంత్రి హోదాలో రాత్రికి రాత్రే తన ఇంటిని ఆ లిస్టులో నుంచి తీసేసుకున్నాడు. మరి నీకు ఒక న్యాయం, మా రైతులు, భీంబాయి, విజయలక్ష్మి లాంటి వాళ్లకు ఒక న్యాయమా రేవంత్ రెడ్డి ఇల్లు తీసినట్టే సిర్పూర్‌లో పెట్టిన 40 వేల ఎకరాలను కూడా వెంటనే 22ఏ నుంచి తొలగించాలి. లేదంటే లక్షలాది మంది రైతులతో సెక్రటేరియట్‌ను, నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌ను ముట్టడిస్తాం.
ఈ పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలి. కొండా సురేఖ నిన్ను తిట్టిందని తీసేశావు.. మరి లక్షల మంది ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. నీకు ఏమైనా దాంట్లో 50/50 వాటా ఉందా రేవంత్ రెడ్డి
అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం, ఈ నెల 7 నుంచి అసెంబ్లీ మొదలవుతుంది, అక్కడ తేల్చుకుంటాం. అప్పటిలోగా తీయకపోతే మా కోవ లక్ష్మక్క ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందే పొయ్యి పెట్టి, వంటా వార్పు చేసి అక్కడే పడుకుంటాం. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో 1000 కుంభకోణాలు, 1000 కబ్జాలు, 1000 అబద్ధాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. 33 నెలలైనా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు.
నెలకు రూ.4,000 ఇస్తామని చెప్పి ప్రతి అవ్వకు, తాతకు ఈ ప్రభుత్వం రూ.66,000 బాకీ పడింది. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 చొప్పున రూ.82,500 బాకీ పడింది. ఏదో ఎన్నికల ముందు మూడు నెలలు పెన్షన్లు పెంచి ఓట్లు గుద్దుకుందామని రేవంత్ రెడ్డి అతితెలివి ప్రదర్శిస్తున్నాడు.
పాత బాకీలన్నీ కక్కిస్తాం. కేసీఆర్ హయాంలో ఏడాదికి 2.60 లక్షల కల్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే, రేవంత్ వచ్చాక అవి 86 వేలకు పడిపోయాయి. 15 పర్సెంట్ కమీషన్ల కక్కుర్తికి భయపడి రోడ్లు, బ్రిడ్జిలకు కాంట్రాక్టర్లు టెండర్లు వేయడం లేదు. ఈ నియోజకవర్గంలో ఎవరెన్ని కుట్రలు చేసినా గులాబీ జెండా ఎగరడం ఖాయం. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఢిల్లీలో కొట్లాడుకుంటారు కానీ, కాగజ్‌నగర్‌లో మాత్రం బీఆర్ఎస్ మీదకు కలిసి వస్తారు.
మా కోనప్ప మా ప్రవీణ్ కుమార్ ఇద్దరూ ఇప్పుడు ఒక్కటయ్యారు. ఇక ఇక్కడ ఏ శక్తి ఎదురొచ్చినా తుఫాన్‌లో కొట్టుకుపోవాల్సిందే. మళ్లీ కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రతి అవ్వా తాత, అక్కా చెల్లెలు నమ్ముతున్నారు. దళారులను నమ్మి రైతులు రూపాయి లంచం ఇవ్వొద్దు, మీ భూములు మీకు దక్కేంతవరకు బీఆర్ఎస్ పార్టీ అండగా కొట్లాడుతుంది.




