Mancherial: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేకే అసత్య ప్రచారాలు

Mancherial: తనపై వస్తున్న రూ.450 కోట్ల అప్పు ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. గూడెం దేవస్థానం అభివృద్ధికి రూ.98 కోట్లు కేటాయింపు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 8 Aug 2026 7:38 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేకే అసత్య ప్రచారాలు

మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు తనపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో మేయర్ దర్ణి మధుకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ఆలయాల అభివృద్ధి, తాగునీటి సమస్యతో పాటు తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించారు.

రూ.98 కోట్లతో గూడెం సత్యనారాయణ దేవస్థానం అభివృద్ధిగూడెం సత్యనారాయణ దేవస్థానం అభివృద్ధికి రూ.98 కోట్లతో నిర్మాణ పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. విశ్వనాథ ఆలయాన్ని రూ.4.94 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి గూడెం దేవస్థానం అభివృద్ధి పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

అదే సమయంలో ఎల్లంపల్లి నుంచి గూడెం గోదావరి వరకు ఎకో టూరిజం, బోటింగ్, యానిమల్ సఫారీ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే మంచిర్యాల ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

యుద్ధప్రాతిపదికన తాగునీటి పనులు

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాళ్లవాగు వద్ద మంచినీటి పైప్‌లైన్లు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే వివరించారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో వెంటనే మరమ్మతులు చేపట్టలేకపోయామని, ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన పైప్‌లైన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రేపు సాయంత్రంలోగా మంచినీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

రూ.450 కోట్ల అప్పు ఆరోపణలు అవాస్తవం

తనపై రూ.450 కోట్ల అప్పు తీసుకుని అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రేమ్ సాగర్ రావు ఖండించారు. వివిధ బ్యాంకుల నుంచి రూ.109.11 కోట్లు మాత్రమే అప్పుగా తీసుకున్నానని, ఆ మొత్తాన్ని 2015 ఏప్రిల్ 15న బ్యాంకులకు చెల్లించినట్లు తెలిపారు.

ఒకే అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే తనపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

తనకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ప్రతిపక్ష నాయకులకు నిద్ర పట్టడం లేదని, కాకి లెక్కలు చెబుతూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story