Chennur: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి మంత్రి వివేక్

Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో సమీక్ష నిర్వహించిన మంత్రి గడ్డం వివేకానంద. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై అధికారులకు కీలక ఆదేశాలు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 5 Aug 2026 6:43 PM IST
Chennur
X

Chennur: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి మంత్రి వివేక్

చెన్నూర్: మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు & భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద ఆదేశించారు. చెన్నూర్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి కోటపల్లి, చెన్నూర్, భీమారం, జైపూర్ మండలాల అధికారులతో మంత్రి గడ్డం వివేకానంద సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.

అమృత్ 2.0 పథకం కింద చెన్నూర్ నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్లతో నీటి ట్యాంకులు, పైప్‌లైన్‌ల నిర్మాణం చేపడుతున్నామని, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. సోలార్ లైటింగ్, కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్ స్తంభాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రెండుపడక గదుల ఇళ్ల కేటాయింపును కూడా వేగవంతం చేయాలని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గుత్తేదారుల పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్లు, అంతర్గత రహదారులు, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ముందస్తుగా సిద్ధం చేయాలని మంత్రి గడ్డం వివేకానంద అధికారులకు సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story