Mancherial: మంచిర్యాల: ఆలయ హుండీ పగలగొట్టి రూ.40 వేలు దోపిడీ!
Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సమీపంలోని ప్రసిద్ధ కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి దొంగలు పడ్డారు.
Mancherial: మంచిర్యాల: ఆలయ హుండీ పగలగొట్టి రూ.40 వేలు దోపిడీ!
మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి వేళ ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు హుండీని పగులగొట్టి దాదాపు 40 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఆలయ పరిసరాల్లో అమర్చిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఈ దుశ్చర్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఆలయ ప్రాంగణంలోకి చొరబడిన దుండగులు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. తమ ఆనవాళ్లు ఎక్కడా చిక్కకుండా ఉండేందుకు ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం గర్భగుడి సమీపంలోని ప్రధాన హుండీ తాళాలు పగులగొట్టి, అందులో భక్తులు సమర్పించిన సుమారు 40 వేల రూపాయల కానుకలను అపహరించుకుపోయారు.
తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న అర్చకులు, సిబ్బంది హుండీ పగిలి ఉండటం, సీసీ కెమెరాలు ధ్వంసమై ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తాళ్ల గురజాల పోలీసులు పరిస్థితిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఆలయ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరిసర ప్రాంతాల్లోని అనుమానితుల కదలికలపై నిఘా ఉంచి దర్యాప్తును ముమ్మరం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంలోనే ఈ తరహా చోరీ ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి జరగడంతో స్థానిక భక్తులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులను తక్షణమే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా దేవదాయ శాఖ అధికారులు రాత్రిపూట ఒక వాచ్మెన్ ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.




