Mancherial: ప్రభుత్వ విద్యలో మంచిర్యాల జిల్లా నంబర్ వన్!
Mancherial: గోవిందరాజ్ పాఠశాలల్లో నమోదు పెంపులో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది. కలెక్టర్ కుమార్ దీపక్ రాష్ట్ర పురస్కారానికి ఎంపికయ్యారు.
Mancherial: ప్రభుత్వ విద్యలో మంచిర్యాల జిల్లా నంబర్ వన్!
Mancherial: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడంలో మంచిర్యాల జిల్లా రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది. విద్యార్థుల చేరికలను పెంచేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యుత్తమంగా సాధించి.. రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
2025–26 విద్యా సంవత్సరంలో మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 43 వేల 72 మంది విద్యార్థులు చదువుతుండగా.. 2026–27 విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 45 వేల 626కు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే మరో 2 వేల 554 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా చేరారు. 2024–25తో పోలిస్తే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 10.34 శాతం పెరిగింది.
జిల్లాలోని మొత్తం 282 ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతానికి పైగా అదనపు విద్యార్థుల నమోదు సాధించడం విశేషం. ముఖ్యంగా మందమర్రి, నస్పూర్, జైపూర్, హాజీపూర్, భీమారం మండలాల్లో విద్యార్థుల చేరికల్లో గణనీయమైన పురోగతి కనిపించింది. దీంతో రాష్ట్రస్థాయి నమోదు లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాజన్న సిరిసిల్ల రెండో స్థానంలో, జగిత్యాల జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్యలో మరో కీలక అంశం ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో రావడం. యూ-డైస్ గణాంకాల ప్రకారం 4 వేల 346 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, డిజిటల్ విద్యా సౌకర్యాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
డిజిటల్ విద్యకు ప్రాధాన్యం
ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక విద్యా విధానాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీలు, ఐసీటీ కంప్యూటర్ ల్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 82 పాఠశాలల్లో కంప్యూటర్ బోధకులను నియమించారు.
విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అకాడమిక్ పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసి.. పాఠశాలల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నారు. విద్యార్థుల హాజరు, బోధనా విధానం, విద్యా ఫలితాలు తదితర అంశాలపై అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
బాలికలకు రెసిడెన్షియల్ విద్య
బాలికల విద్యకు కూడా జిల్లాలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత రెసిడెన్షియల్ విద్య అందుబాటులో ఉంది.
అలాగే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తదుపరి దశలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే చేరేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా పర్యవేక్షించే విధంగా చర్యలు చేపట్టారు.
సమష్టి కృషికి గుర్తింపు మంచిర్యాల జిల్లా సాధించిన ఈ విజయానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మార్గదర్శకత్వం, జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఎంఐఎస్, సీసీఓలు, సీఆర్‌పీల సమష్టి కృషి కారణమని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుతో పాటు విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు రాష్ట్ర ప్రభుత్వం “విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026” ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు.
సెప్టెంబర్ 5న నిర్వహించే రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ కుమార్ దీపక్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం ఇప్పుడు కలెక్టర్‌కు దక్కిన రాష్ట్రస్థాయి పురస్కారం మంచిర్యాల జిల్లాకు విద్యారంగంలో మరో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
ప్రభుత్వ విద్యపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు కృషి చేస్తామని జిల్లా అధికారులు చెబుతున్నారు.




