Mancherial: బెల్లంపల్లిలో ఇసుక రవాణా రచ్చ: పోలీసు స్టేషన్‌కు చేరిన పంచాయితీ!

Mancherial: బెల్లంపల్లి పరిధి నెన్నెల మండలం కర్జి ఇసుక రీచ్ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. కాంగ్రెస్ నేత అండతో అక్రమ రవాణా జరుగుతోందని ట్రాక్టర్ యజమానులు ఆరోపిస్తున్నారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 14 Aug 2026 5:44 PM IST
Mancherial
X

Mancherial: బెల్లంపల్లిలో ఇసుక రవాణా రచ్చ: పోలీసు స్టేషన్‌కు చేరిన పంచాయితీ!

మంచిర్యాల: నెన్నెల మండలం కర్జి గ్రామంలోని ఇసుక రీచ్‌ మూతపడటంతో.. ఇసుక రవాణాపై వివాదం నెలకొంది. రీచ్‌ వద్ద స్థానిక ట్రాక్టర్ యజమానులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మధ్య గొడవ జరగడంతో మైనింగ్ అధికారులు రీచ్‌ను మూసివేశారు.అయితే రీచ్‌ మూసివేయడంతో.. ఇదే అదునుగా కొందరు ట్రాక్టర్ యజమానులు రాత్రి వేళల్లో స్థానిక ట్రాక్టర్ల ద్వారా ఇసుకను బెల్లంపల్లి పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నెన్నెల మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత అండదండలతో రీచ్‌ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని.. మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని బెల్లంపల్లి ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా తరలించిన ఇసుక ద్వారా వచ్చిన సొమ్ములో సదరు కాంగ్రెస్ నేతకు వాటాలు అందుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో వ్యవహారం బెల్లంపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరింది.పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకముందే అధికారులు స్పందించి ఇసుక రీచ్‌ను తిరిగి ప్రారంభించాలని ట్రాక్టర్ యజమానులు కోరుతున్నారు. అందరికీ సమానంగా ఇసుక రవాణాకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story