Asifabad: కొమురం భీం జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం!
Asifabad: ఆసిఫాబాద్‌లో వైభవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. సంప్రదాయ దుస్తుల్లో హాజరై, ఆదివాసీలతో కలిసి నృత్యం చేసిన జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నీతిక పంత్.
Asifabad: కొమురం భీం జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం!
Asifabad: కొమురం భీం జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ భవన్ వేదికగా జరిగిన ఈ వేడుకలు పండగ వాతావరణాన్ని తలపించాయి.
జిల్లా కేంద్రంలో ఆదివాసీలు భారీ ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించి.. మన్యం వీరుడు కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, గ్రంథాలయ చైర్మన్ అనిల్‌తో పాటు జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా ఎస్పీ నీతిక పంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కలెక్టర్ హరిత, ఎస్పీ నీతిక పంత్ ఆదివాసీ సాంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆదివాసీ కళాకారులతో కలిసి అధికారులు ఉత్సాహంగా సంప్రదాయ నృత్యాల్లో పాల్గొన్నారు.
ఆదివాసీ మహిళలు, యువకులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. ఆదివాసీల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాగిన కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. ఆదివాసులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని కొనియాడారు.
ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని.. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆదివాసీ గూడెల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు.
ఆదివాసీల హక్కులను, వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్ గుర్తుచేశారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల వైభవం ప్రతిబింబించగా.. అధికారులే స్వయంగా సంప్రదాయ నృత్యాల్లో పాల్గొనడం వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.




