Mancherial: మిస్సింగ్ కేసు గుట్టురట్టు తండ్రిని చంపి మిస్సింగ్ కేసుగా డ్రామా!

Mancherial: తండ్రి లక్ష్మణ్‌ను పథకం ప్రకారం గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని కాల్చేసి మిస్సింగ్ కేసుగా నమ్మించిన కుమారుడు భీమిని ఉదయ్‌ను జైపూర్ సీఐ నవీన్ కుమార్ అరెస్ట్ చేశారు.

RAJENDER, CHENNUR
Published on: 12 Aug 2026 11:11 PM IST
Mancherial
X

Mancherial: మిస్సింగ్ కేసు గుట్టురట్టు తండ్రిని చంపి మిస్సింగ్ కేసుగా డ్రామా!

మంచిర్యాల జిల్లా: మిస్సింగ్ కేసుగా చిత్రీకరించి, పథకం ప్రకారం తండ్రిని హత్య చేసి మృతదేహాన్ని తగులబెట్టిన కేసులో కుమారుడు భీమిని ఉదయ్‌ (23)ను అరెస్టు చేసినట్లు జైపూర్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. తేదీ 11-08-2026న భీమారం పోలీస్ స్టేషన్‌లో నిందితుడు భీమిని ఉదయ్‌ను విచారించగా, తండ్రి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు సీఐ తెలిపారు.

సీఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ప్రేమ వివాహం చేసుకోవడం తండ్రి లక్ష్మణ్‌కు ఇష్టం లేకపోవడంతో, అతను తరచూ నిందితుడిని, అతని భార్యను దూషిస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ నేపథ్యంలో నిందితుడు కిష్టంపేట నుంచి భీమారంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చి అక్కడ ఉంటున్నాడు. ఈ క్రమంలో 21-07-2025న లక్ష్మణ్ భీమారంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చి నిందితుడి భార్యను దూషిస్తూ గొడవకు దిగాడు.

దీంతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నిందితుడు తన తండ్రిని బైక్‌పై భీమారం శివారులోని గొల్లవాగు ప్రాజెక్టు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతని గొంతు పిసికి హత్య చేసి, మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడవేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు విచారణలో వెల్లడించాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయి, తన తండ్రి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులతో కలిసి వెతికినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం చెన్నూర్ పోలీస్ స్టేషన్‌లో లక్ష్మణ్ అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయించి మిస్సింగ్ కేసు నమోదు చేయించినట్లు తెలిపారు. తేదీ 30-07-2025న గొల్లవాగు అటవీ ప్రాంతంలో మృతదేహం లభించగా, మృతదేహంపై ఉన్న దుస్తులు,చెప్పులు తదితర ఆనవాళ్ల ఆధారంగా అది లక్ష్మణ్ మృతదేహంగా కుటుంబ సభ్యులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు హత్యకు ఉపయోగించినట్లు తెలిపిన ఎరుపు రంగు హీరో గ్లామర్ బైక్ (TS01EB8338)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాను తన తండ్రిని హత్య చేసిన ప్రదేశాన్ని చూపిస్తానని నిందితుడు తెలిపినట్లు సీఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు. ఈ పత్రికా సమావేశంలో ఎస్‌ఐ రాజేందర్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story