Bellampalli: బెల్లంపల్లి ఆశ్రమ పాఠశాలలో కాంగ్రెస్ నేతకు విద్యార్థుల కవాతు రచ్చ
Bellampalli: మంచిర్యాల బెల్లంపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంగ్రెస్ నాయకుడికి విద్యార్థులతో కవాతు స్వాగతంపై వివాదం. సమగ్ర విచారణకు విద్యార్థి సంఘాల డిమాండ్.
Bellampalli: బెల్లంపల్లి ఆశ్రమ పాఠశాలలో కాంగ్రెస్ నేతకు విద్యార్థుల కవాతు రచ్చ
Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నిర్వహించిన పండ్ల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. బెల్లంపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసేందుకు వెళ్లిన ఓ కాంగ్రెస్ నాయకుడికి.. విద్యార్థులు లాంఛనంగా కవాతు చేస్తూ స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా విద్యార్థుల విద్యాభ్యాసానికి సంబంధించిన కార్యక్రమాలకే పరిమితం కావాల్సిన ఆశ్రమ పాఠశాలలో.. రాజకీయ నాయకుడి రాక సందర్భంగా విద్యార్థులతో కవాతు చేయించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు విద్యార్థులతో కవాతు చేయించాలని నిర్ణయించింది ఎవరు? కవాతుకు ప్రిన్సిపల్ అనుమతి ఇచ్చారా? ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్నారా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.
విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యం, అధికారులపై ఉంటుంది. అలాంటప్పుడు ఓ రాజకీయ నాయకుడి రాక సందర్భంగా విద్యార్థులను కవాతులో పాల్గొనేలా చేయడంపై విద్యార్థి సంఘాలు, పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. విద్యార్థుల సమస్యలపై కవరేజ్ చేసేందుకు వెళ్లే మీడియాకు ఆశ్రమ పాఠశాలలోకి అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారు. అయితే రాజకీయ నాయకులు పాఠశాలలోకి వెళ్లి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలా అనుమతి లభించింది? మీడియాకు ఒక నిబంధన.. రాజకీయ నాయకులకు మరో నిబంధనా? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
విద్యార్థుల భద్రత, విద్యా వాతావరణం, పాఠశాలల రాజకీయ రహిత నిర్వహణపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పందించి.. కవాతు నిర్వహణకు ఎవరు అనుమతి ఇచ్చారు? కార్యక్రమం ఎలా నిర్వహించారు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.




