Mancherial: ఓటరు జాబితా సవరణకు పార్టీలు సహకరించాలి: మంచిర్యాల కలెక్టర్!

Mancherial: మంచిర్యాల జిల్లాలో పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 11 Aug 2026 5:38 PM IST
Mancherial
X

Mancherial: ఓటరు జాబితా సవరణకు పార్టీలు సహకరించాలి: మంచిర్యాల కలెక్టర్!

మంచిర్యాల: స్పష్టమైన, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. మంగళవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ, మార్పులు–చేర్పులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అక్టోబర్ 1, 2026 అర్హత తేదీగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 747 పోలింగ్ కేంద్రాలకు అదనంగా 18 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు 22 కేంద్రాల స్థానాలను మార్చడం, ఒక కేంద్రం పేరును మార్చడం ప్రతిపాదించినట్లు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 765కు చేరనుందని వెల్లడించారు.నియోజకవర్గాల వారీగా చెన్నూర్‌లో 230 నుంచి 235కు, బెల్లంపల్లిలో 227 నుంచి 231కు, మంచిర్యాలలో 290 నుంచి 299కు పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగనుందని తెలిపారు.

సవరించిన కార్యాచరణ ప్రకారం ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని, వాటి పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని చెప్పారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వివరాలను పరిశీలించి, అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే నిర్ణీత గడువులోగా సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story