Mancherial: మంచిర్యాలలో రూపుదిద్దుకున్న అధునాతన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్
Mancherial: రూపుదిద్దుకున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఆగస్టు 31న ప్రారంభించనున్న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు. 3 జిల్లాల్లోని 49 వేల మంది విద్యార్థులకు ఉచిత అల్పాహారం.
Mancherial: మంచిర్యాలలో రూపుదిద్దుకున్న అధునాతన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్
Mancherial: మంచిర్యాల జిల్లాలో విద్యార్థులకు మరింత మెరుగైన పోషకాహారం అందించేందుకు సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ అందుబాటులోకి రానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ గోడౌన్ ప్రాంగణంలో నిర్మించిన ఈ అధునాతన కిచెన్‌ను ఆగస్టు 31న ప్రారంభించనున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అమలు భాగస్వామిగా, సింగరేణి కాలరీస్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో ఈ కిచెన్ నిర్మాణానికి సహకారం అందించింది. ఈ కిచెన్ ద్వారా జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని 17 మండలాల పరిధిలో 691 ప్రభుత్వ పాఠశాలల్లోని 42,450 మంది విద్యార్థులతో పాటు 13 జూనియర్ కళాశాలల్లోని 6,654 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహార అల్పాహారం అందించనున్నారు.
8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కిచెన్‌లో ఫుడ్ ల్యాబ్, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, ఆటోమేటిక్ వెజిటబుల్ వాషింగ్ అండ్ కటింగ్ యూనిట్‌తో పాటు అధునాతన వంట యంత్రాలను ఏర్పాటు చేశారు. గంటకు వేలాది ఇడ్లీలు, దోశలు, పూరీలు తయారు చేసే సామర్థ్యంతో పాటు భారీ స్థాయిలో సాంబార్, కూరలు, అ
న్నం తయారు చేసే సదుపాయాలు ఉన్నాయి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచనల మేరకు విద్యార్థులకు సమతుల్యమైన మెనూను రూపొందించారు. వారంలో ఇడ్లీ, పూరీ, దోశ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, బోండా వంటి అల్పాహారాలను అందించనున్నారు.
విద్యార్థులు ఉదయం పూట ఆకలితో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వెళ్లకుండా.. పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పోషకాహార అల్పాహారం తీసుకుని ఉత్సాహంగా విద్యను అభ్యసించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంతో వేలాది మంది విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం చూపనుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షులు హిస్ గ్రేస్ శ్రీ సత్య గౌర చంద్ర దాస స్వామీజీతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొననున్నారు.




