Bellampalli: బెల్లంపల్లి కొత్త బస్టాండ్‌లో భారీ గుంత ఎమ్మెల్యే పరిశీలన

Bellampalli: బెల్లంపల్లి కొత్త బస్టాండ్‌ ప్రాంగణంలో కుంగిన భూమి.. ఏర్పడిన భారీ గుంత. ఘటనాస్థలాన్ని పరిశీలించి చర్యలకు ఆదేశించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్.

PRATHAP, BELLAMPALLI
Published on: 1 Aug 2026 2:39 PM IST
Bellampalli
X

Bellampalli: బెల్లంపల్లి కొత్త బస్టాండ్‌లో భారీ గుంత ఎమ్మెల్యే పరిశీలన

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కొత్త బస్టాండ్‌లో భారీ గుంత ఏర్పడటం కలకలం రేపింది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.బెల్లంపల్లి కొత్త బస్టాండ్ భవనంలో అకస్మాత్తుగా భారీ గుంత ఏర్పడడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

అదృష్టవశాత్తూ గుంత ఏర్పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఘటనాస్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ గుంతను పరిశీలించి, గుంత చుట్టూ వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రయాణికులు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్‌ను ఆదేశించారు.

గతంలో ఈ ప్రాంతంలో సింగరేణి అండర్‌గ్రౌండ్ బొగ్గు గనులు ఉండటంతో, వాటి ప్రభావం వల్లే భూమి కుంగి గుంత ఏర్పడి ఉండవచ్చని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణతో ఫోన్‌లో మాట్లాడి, సాంకేతిక నిపుణులతో పరిశీలన చేపట్టి అవసరమైన సహాయక చర్యలు వెంటనే ప్రారంభించాలని సూచించారు.

బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు అనేక అండర్‌గ్రౌండ్ గనులు నిర్వహించగా, బొగ్గు తవ్వకాల అనంతరం అవి మూసివేయబడ్డాయి. ప్రస్తుతం అదే ప్రాంతంలో బస్టాండ్ ఉండటంతో నిత్యం వందలాది బస్సులు, వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయి భూగర్భ సర్వే నిర్వహించి, ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story