Asifabad: డీలర్ల సంక్షేమ నిధిపై తప్పుడు ప్రచారం అవాస్తవం
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దాహేగాం మండలంలో ఫెర్టిలైజర్, సీడ్స్ డీలర్ల సంక్షేమ నిధిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం పూర్తిగా అవాస్తవమన్న అసోసియేషన్.
Asifabad: డీలర్ల సంక్షేమ నిధిపై తప్పుడు ప్రచారం అవాస్తవం
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దాహేగాం మండలంలో ఫెర్టిలైజర్, సీడ్స్, పెస్టిసైడ్స్ డీలర్ల సంక్షేమ నిధిపై సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని దాహేగాం మండల డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. వ్యవసాయ అధికారి, ఏసీబీ పేర్లను ఉపయోగిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తూ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.
దాహేగాం మండల ఫెర్టిలైజర్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్స్ అసోసియేషన్ సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారమైన కథనం, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని పేర్కొంది.
డీలర్ల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన యూనియన్ ఫండ్‌ను కొందరు వ్యక్తులు వక్రీకరించి, వ్యవసాయ అధికారి లంచాల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఈ సంక్షేమ నిధికి స్థానిక మండల వ్యవసాయ అధికారికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
డీలర్లలో ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ప్రమాదాలకు గురైనా వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు, అలాగే ప్రతి సంవత్సరం నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం ఖర్చుల కోసం మాత్రమే ప్రతి దుకాణ యజమాని నుంచి స్వచ్ఛందంగా రూ.20 వేల చొప్పున నిధి సేకరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిధికి సంబంధించిన అన్ని లెక్కలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే, ఏసీబీ పేరును వాట్సాప్ స్టేటస్‌లలో ఉపయోగిస్తూ భయభ్రాంతులకు గురిచేసి వ్యాపారులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించింది. సంఘం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లీగల్ నోటీసులు జారీ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని దాహేగాం మండల ఫెర్టిలైజర్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రజలు, రైతులు ఇలాంటి నిరాధార ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసారు..




